Share News

మోతాదుకు మించితే ముప్పే

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:04 AM

రైతులు సాగు చేసిన పంటలు సత్వరమే ఎదగాలంటే యూరియా వాడకం తప్పనిసరి అన్న పరిస్థితులు నేడు వ్యవసాయ రంగంలో నెలకొన్నాయి.

మోతాదుకు మించితే ముప్పే

యూరియాను అధికంగా వాడితే భూసారం తగ్గే ప్రమాదం

అవగాహనలేమితో నష్టపోతున్న అన్నదాతలు

ఉమ్మడి జిల్లాలో ఈఏడాది పెరగనున్న వరి సాగు విస్తీర్ణం

కొలిమిగుండ్ల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రైతులు సాగు చేసిన పంటలు సత్వరమే ఎదగాలంటే యూరియా వాడకం తప్పనిసరి అన్న పరిస్థితులు నేడు వ్యవసాయ రంగంలో నెలకొన్నాయి. ప్రధానంగా యూరియా వాడితే పంట దిగుబడులు బాగా వస్తాయన్న కారణంతో రైతులు యూరియాను అధికంగా వాడే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత వ్యవసాయ విధానంలో గతంలో కన్నా రెట్టింపు స్థాయిలో రైతులు యూరియాను వినియోగిస్తున్నారన్న విషయం అధికారిక లెక్కలే తేల్చి చెబుతున్నాయి. అయితే యూరియా వినియోగం అతిగా జరిగితే అన్నీ అనర్థాలేనని పర్యావరణ శాస్త్రవేతలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భూసారం దెబ్బతిని, నేలలు సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు, నదులు, ప్రధాన కాలువలు, చెరువులు, బోరు బావుల కింద వరి సాగు ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వరి సాధారణ సాగు విస్తీర్ణం 78,174 హెక్టార్లు కాగా, ఇప్పటికే 60వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. సహజంగా వరి సాగు చేసిన రైతులు పంట సాగు దగ్గర నుండి నూర్పిడి వరకు మూడు విడతలుగా 25 కేజీల చొప్పున 75 కేజీలు వాడాల్సి ఉంది. యూరియాకు తోడు మరో 75కేజీల కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగించవచ్చు. అయితే రైతులు అవగాహన లేమి కారణంగా మొత్తం 150 కేజీలు(3బస్తాలు) యూరియా, మరో 3బస్తాలు కాంప్లెక్సు ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో రైతులకు ఎరువుల భారం అమాంతం పెరిగిపోతోంది. ప్రస్తుతం ఎరువుల ధరల ప్రకారం చూస్తే రైతులకు ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల సుమారు రూ.6వేలు అదనపు భారం పడుతోంది. సహజంగా ఎకరా వరి పంటకు 72కిలోల నత్రజని మాత్రమే అవసరం అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాంప్లెక్సు ఎరువుల్లో సైతం నత్రజని మిళితమైవుంటుందని సూచిస్తున్నారు. రైతులుకు సరైన అవగాహన లేక యూరియాను ఎక్కువగా వాడేస్తున్నారని పేర్కోంటున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తే, భూమి దెబ్బతినకుండా ఉండటంతో పాటు, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని అంటున్నారు.

ఎక్కువగా వాడితే అనర్థాలే

యూరియాను అతిగా వినియోగించడం వల్ల పకృతి పరంగా అన్నీ అనర్థాలే జరిగే అవకాశం ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ, అధికారులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్రమంగా పంట పొలాలు భూసారం కోల్పోయి, కొంత కాలానికి నేలలు తమ సహజత్వాన్ని కోల్పోయి నిస్సారంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఎన్ని ఎరువులు వేసినా పంటలు పండకపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సహజంగా భూసారం పెరిగే చర్యలు చేట్టి, ఎరువుల వాడకం తగ్గిస్తే ఎంతో మేలు చేకూరే అవకాశం ఉంటుంది. పిల్లి పెసర, జనుము తదితర పంటలు సాగుచేసి వాటిని కలియదున్నితే భూసారం పెరిగి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. భూసార పరీక్షలు చేయించి, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలు వినియోగించడం ద్వారా రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంటుంది. అయితే రైతులు అవగాహన లేమితో ఎరువులను, ముఖ్యంగా యూరియాను అతిగా వాడుతున్నారు. ఏపంటకు ఎంతమేర ఎరువులు వినియోగించాలన్న విషయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

ఏ పంటలకు ఎంత ఎరువులు వినియోగించాలన్న విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామస్థాయిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తే, పెట్టుబడి భారం తగ్గడంతో పాటు, దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. -సుధాకర్‌, ఏడీ, వ్యవసాయశాఖ

Updated Date - Sep 16 , 2025 | 12:04 AM