ముంచిన తుఫాను
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:35 AM
అసలే తెగుళ్లతో సతమతమవుతున్న పంటలను ఇటీవల కురిసిన తుఫాన్ మొత్తంగా ధ్వంసం చేసింది. మొంథా తుఫాన్ దెబ్బతో పొలాల్లో వర్షం నీరు నిల్వ ఉండటంతో పంటలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓర్వకల్లు మండలంలో నీట మునిగిన పొలాలు
ఓర్వకల్లు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): అసలే తెగుళ్లతో సతమతమవుతున్న పంటలను ఇటీవల కురిసిన తుఫాన్ మొత్తంగా ధ్వంసం చేసింది. మొంథా తుఫాన్ దెబ్బతో పొలాల్లో వర్షం నీరు నిల్వ ఉండటంతో పంటలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని హశేనాపురం, ఓర్వకల్లు, కన్నమడకల, నన్నూరు, పూడిచెర్ల, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, గుట్టపాడు, సోమయాజులపల్లె తదితర గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న, పొగాకు, కంది, టమోటా 4,500 ఎకరాల్లో సాగు చేశారు. ఓవైపు తెగుళ్లు, మరోపక్క భారీ వర్షాలతో పంటలు మునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. 15 రోజుల క్రితం వేసిన పప్పు శనగ పంట మొలకెత్తింది.
యాజమాన్య పద్ధతులు పాటించాలి
యాజమాన్య పద్దతులు పాటిస్తే పంటను కాపాడుకోవచ్చు. వర్షపు నీటిని తొలగించాక ఎకరాకు 25 నుంచి 30 కిలోల యూరియా లేదా 10-15 కిలోల న్యూరేట్ ఆఫ్ పొటాష్ పిచికారీ చేయాలని. అధిక వర్షాలతో పైరులో మెగ్నీషియం లోపంతో ఆకులు ఎండిపోతాయి. మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పైరుపై పిచికారి చేయాలి. పత్తిలో కాయకుళ్లు, ఆకుమచ్చ తెగులు నివారణకు 3 గ్రా. కాపర్, యాక్సి ప్లోరైడ్‌ను లీటరు నీటి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. - మధుమతి, ఏవో, ఓర్వకల్లు.