Share News

సైబర్‌గాళ్లు

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:22 PM

సెల్‌ఫోన్‌తో ప్రతి వస్తువు ఆన్‌లైన్‌లో కొనే వెసులుబాటు వచ్చింది.

సైబర్‌గాళ్లు

ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న వైనం

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్‌ నేరాలు

నకిలీ వెబ్‌సైట్లతో అక్రమాలు

లబోదిబోమంటున్న ప్రజలు

బాధితుల్లో విద్యాధికులు, ఉద్యోగులు

అవగాహన కల్పిస్తున్న సైబర్‌ పోలీసులు

సెల్‌ఫోన్‌తో ప్రతి వస్తువు ఆన్‌లైన్‌లో కొనే వెసులుబాటు వచ్చింది. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి గృహోపకరణాలు, సెల్‌ఫోన్లు, దుస్తులు, ఖరీదైన వస్తువులు తక్కువ ధరకే ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఆర్డర్‌ పెట్టాక నాసిరకం వస్తువులు, ఇటుకలు, చెక్కలు, ఖాళీ బాక్సులు డెలివరీ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ల్లో సైతం మోసం జరుగుతోంది. దీంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలా మంది భయపడుతున్నారు. కనీసం ఫిర్యాదు కూడా చేయలేకపోతున్న తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం...

నంద్యాల టౌన్‌, జూన్‌6 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. నంద్యాల జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 ఇప్పటి వరకు కేవలం 29 కేసులు మాత్రమే నమోదు చేశారు. ఇలా చాలా మంది మోసపోతున్నా.. సైబర్‌ నేరగాళ్ల గురించి ఎవరూ పోలీసులకు ఫిర్యా దు చేయడం లేదు. ఆన్‌లైన్‌ పేమెం ట్‌ చేసే సమయంలో ఎవరికి, ఏ ప్రాంతంలో చేస్తున్నాం అన్నది గమనించాలని నిపుణులు చెబుతు న్నారు. ఇలా మోసపోయిన వారిలో విద్యాధికులు సైతం ఉండడం విశే షం. ఆధునిక సాంకేతికత అనేక సౌ కర్యాలను అందిస్తున్న మాట నిజమే. కానీ దాని దాపునే అనేక మోసాలు జరుగుతున్నాయి.

ఆఫర్లకు ఆకర్షితులై..

బ్రాండెడ్‌ వస్తువులు, సగం ధరలకే వస్తున్నాయనే ఆఫర్లకు ఆకర్షితులై వెబ్‌సైట్లో వచ్చిన లింకులు ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ముందు వెనుక చూడకుండా కొందరు కొనుగోలు చేస్తున్నారు. డబ్బులు చేతులు మరాక వెబ్‌సైట్‌లు మాయం అవుతున్నాయి. క్యాష్‌ ఆన్‌ డెలివరీ, రిటర్న్‌ ఆప్షన్‌ ఉంటేనే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఆన్‌లైన్‌ ద్వారా, కొన్ని నెంబర్ల నుంచి ఫోన్‌చేసి మాట్లాడి మోసం చేయడంతో వారి ఆకౌంటులోని డబ్బులు మాయం అయ్యాయి. అయినా ఎవరికీ చెప్పుకోలేక, అవగాహన లేక ఫిర్యాదులు చేయడం లేదు. ఇదిలా ఉంటే చాలా యువత, విద్యార్థులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడి అకౌంటు ద్వారా లావాదేవీలు చేయడంతో డబ్బులు మాయం అవుతున్నాయి. ఇదంతా తెలిసినా ఫిర్యాదు చేయలేక ఆస్తులు అమ్మి, చెల్లించినవాళ్లు ఉన్నారు.

బాధితులు వీరే..

నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలానికి చెందిన ఒక మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బెంగళూరులో పనిచేస్తున్నారు. 2024లో సంక్రాం తికి ఇంటికి వచ్చారు. తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ చేసి మీకు ఆన్‌లైన్‌లో విమానం టిక్కెట్లు తక్కువ ధరకు వస్తున్నాయి. మీరు మళ్లీ ఎక్కువకు అమ్ముకోవచ్చని చెప్పారు. ఆమె వారు అడిగిన సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ.18లక్షలు తీసుకున్నారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె వెంటనే నంద్యాల సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శిరివెళ్లకు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగికి 2025 జనవరిలో గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌చేసి మీ ఆధార్‌ కార్డు మీద వేరే వాళ్లు సిమ్‌ తీసుకుని క్రైం చేశారని భయపెట్టారు. ఆయన అకౌంటు నుంచి ఏకంగా రూ.32లక్షలు తీసుకున్నారు.

ఫిర్యాదు చేయనివి..

నంద్యాల పట్టణానికి చెందిన ఒక వ్యాపారికి అర్ధరాత్రి ఆగకుండా సుమారుగా 20సార్లు ఫోన్‌ చేశారు. కానీ ఎత్తలేదు. కంటిన్యూగా చేస్తుంటే ఒక్కసారి ఫోన్‌ ఎత్తి హలో అనగానే అతని క్రెడిట్‌ కార్డు నుంచి ఏకంగా ఐఫోన్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం వచ్చింది. కానీ చిరునామా చూడగా అందులో ముంబైలో ఉన్నట్లు చూపించింది. దీంతో చేసేదేమీలేక ఆ మొత్తాన్ని కట్టాడు. ఫిర్యాదు చేయలేదు.

ఇటీవల నంద్యాల రైల్వే కానిస్టేబుల్‌ అకౌంటులో ఏకంగా రెండు నెలల వ్యవధిలో రూ.లక్ష మైనస్‌ పడింది. దీంతో బ్యాంకు వారిని అడగగా వారు హోల్డ్‌ చేశామన్నారు. ఇది ఎందుకు మైనస్‌ పడిందని చెప్పలేకోపోతున్నారు. సైబర్‌ పోలీసులను అడగగా వారు ఇది బ్యాంకుకు సంబంధించినది అని చెప్పారని బాధితుడు తెలిపారు.

నంద్యాలలోని పాత పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో ఐఫోన్‌ తక్కువకు ఆఫర్‌ ఉందని చూసి ఆర్డర్‌ చేశారు. డెలివరీ సమయంలో అందులో చెక్కముక్కలు ఉన్నాయి. చేసేదేమీ లేక డబ్బులు పోయాయని, అర్థమై కూడా ఫిర్యాదు చేయలేదు.

అవగాహన కల్పిస్తున్నాం

చాలా వరకు ప్రజల్లో, విద్యార్థులకు ఎప్పటికప్పుడు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమ త్తత అవసరం. ఆన్‌లైన్‌ కొనుగోలు చేసే సమయంలో నిజ నిజాలు తెలుసుకోవాలి. అనుమానం వస్తే వెంటనే సైబర్‌ పోలీసులకు సమాచారమివ్వాలి.

వంశీధర్‌ , సీఐ, సైబర్‌ క్రైం, నంద్యాల జిల్లా

Updated Date - Jun 06 , 2025 | 11:22 PM