సైబర్ నేరాలను నియంత్రించాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:38 PM
జిల్లాలో దొంగతనం కేసులను ఛేదించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.
నేర సమీక్షలో ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దొంగతనం కేసులను ఛేదించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శనివారం కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై, సైబర్ నేరాలు తగ్గించే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. రాత్రి వేళలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. గుంతలు, మలుపులు ఉన్న చోట సూచన బోర్డులు ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్ లోడింగ్ వాహనాలు వెంటనే నిలిపి వేయాలని ఆదేశించారు. డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. వయస్సు పైబడిన రౌడీషీటర్ల పేర్లను తొలగించాలని సూచిం చారు. ఆదివారం భారత్ బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆపరేషన్ కగార్‌లో ఫేక్ ఎన్‌కౌంటర్ అంటూ కలెక్టరేట్ వద్ద జరిగే ర్యాలీలో పాల్గొనే వారి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. సచివాలయ మహిళా పోలీసులను బందోబస్తుకు మినహాయించాలన్నారు. వారిని స్టేషన్ విధులకు వినియోగించాలని సూచించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా ట్రయల్‌కు వచ్చేలా చూడాలన్నారు. అనంతరం వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుశేన్‌పీరా, డీఎస్పీలు బాబు ప్రసాద్, వెంకట్రామయ్య, హేమలత, భార్గవి, సీఐలు పాల్గొన్నారు.