Share News

కాలు నరికి.. ఊరంతా తిరిగి..

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:02 AM

కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామంలో బుధవారం దారుణ హత్య జరిగింది. కురువ శేషన్న(62)ను అదే గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు హత్య చేశారు. వృద్ధుడి శరీరం నుంచి నరికిన కాలు తీసుకొని ఊరంతా స్వైర విహారం చేసి ఆపై పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు.

కాలు నరికి.. ఊరంతా తిరిగి..
నరికిన కాలితో బైక్‌పై తిరుగుతున్న యువకులు

కర్నూలు జిల్లాలో దారుణ హత్య

తమ జోలికి వస్తే ఇదే గతి పడుతుందని బెదిరింపు..

హత్యపై పోలీసుల నిర్లక్ష్యం

చంపేస్తారయ్యా.. అని చెప్పినా పట్టించుకోని పోలీసులు

వివాహేతర సంబంధంలో ఉన్నాడనే అనుమానంతోనే..

కర్నూలు క్రైం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామంలో బుధవారం దారుణ హత్య జరిగింది. కురువ శేషన్న(62)ను అదే గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు హత్య చేశారు. వృద్ధుడి శరీరం నుంచి నరికిన కాలు తీసుకొని ఊరంతా స్వైర విహారం చేసి ఆపై పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటన బుధవారం జరిగింది. తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన కురువ శేషన్న 20 ఏళ్ల కింద కుటుంబంతో వచ్చి సూదిరెడ్డిపల్లెలో స్థిరపడ్డాడు. ఈయనకు కొడుకు, ఐదుగురు కూతుళ్లు సంతానం. కొడుకు హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. ఇదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు కురువ పరశురాముడు, గోవిందు, కుమార్‌, బీసన్నలకు శేషన్నతో ఆయనకు మనస్పర్ధలు ఉన్నాయి. వీరి కుటుంబంలోని ఓ మహిళతో శేషన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం. ఈ క్రమంలో సోమవారం రాత్రి నలుగురు కలిసి శేషన్న ఇంటిపైన దాడి చేశారు. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి దూరి అదే శేషన్నపై దాడి చేశారు. ఈ ఘటనలో శేషన్న భార్య వెంకటేశ్వరమ్మకు కూడా గాయాలయ్యాయి తర్వాత నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు శేషన్నను, ఆయన భార్య వెంకటేశ్వరమ్మను ఆసుపత్రికి తరలించారు. ముందుగా వీరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం ఆసుపత్రి నుంచి వీరు డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి మరోసారి శేషన్న ఇంటిపైన దాడికి దిగారు. రాజీ పడుదామని నమ్మించి... తమ పైన దాడి చేశారని శేషన్న, ఆయన భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయం మాట్లాడటానికి నిందితు లు మంగళవారం రాత్రి కురువ శేషన్న ఇంటికి వెళ్లారు. బెడ్‌రూములో ఉన్న శేషన్న మీద దాడిచేసి కాలు నరికారు. అక్కడే ఉన్న శేషన్న కూతురు శకుంతల గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకుండా పోయింది. నిందితులు శేషన్న కాలు తీసుకుని బైక్‌పై ఊరంతా తిరిగారు. తమజోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని గ్రామస్థుల ను తీవ్రంగా హెచ్చరించారు. ముగ్గురు నిందితులు బైక్‌పై వెళుతుండగా మరో నిందితుడు వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. తర్వాత నిందితులు కాలుని దూరంగా విసిరేసి పోలీస్‌ స్టేషన్‌లో లొంగి పోయారు. కాలు తెగిపోవడంతో అపస్మారక స్థితికి వెళ్లిన శేషన్నను బంధువులు ఆసుప త్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పట్టించుకోని పోలీసులు

సోమవారం రాత్రి తమపై దాడిచేసి కొట్టారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ముందుగా ఎంఎల్‌సీ చేయించుకురావాలని సలహా ఇచ్చి వెనక్కి పంపారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా సీఐలు, ఎస్‌ఐలు బిజీగా ఉన్నారనీ, మీరు ఇంటికి వెళ్లిపోవాలని చెప్పడంతో శేషన్న, భార్య ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం బాధితులు పోలీసు లకు ఫోన్‌ చేశారు. ‘అయ్యా.. మమ్మల్ని చంపేస్తారు. కాపాడండి సారూ..’ అని బాధితుడు శేషన్న పోలీసులకు చెప్పాడు. ‘మీరు స్టేషన్‌కు రానవసరం లేదు. మేము పిలిచినప్పుడే రండి. మీపై రేప్‌ కేసు పెట్టారు...’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పోలీసులు తమ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ హత్య జరిగేది కాదంటూ శేషన్న బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు స్పందించి ఉంటే తమ తండ్రి బతికేవాడని శేషన్న కుమార్తెలు బోరున విలపించారు. ఇదిలా ఉండగా బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమయంలో పోలీసులు ఓ ప్రైవేట్‌ పార్టీలో బిజీగా ఉండటంతోనే కేసును తేలిగ్గా తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Jul 03 , 2025 | 01:02 AM