Share News

శ్రీగిరిపై భక్తుల సందడి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:49 PM

అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తుల తాకిడితో సందడిగా మారింది.

శ్రీగిరిపై భక్తుల సందడి
శ్రీశైల భ్రమరాంబకు పూజలు చేస్తున్న అర్చకులు

ఆది దంపతులకు కళా నీరాజనాలు

శ్రీశైలం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తుల తాకిడితో సందడిగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుండి పాతాళ గంగలో పుణ్య స్నానాలు చేసుకుని తలనీలాలు మొక్కులుగా సమర్పించుకున్నారు. ఉభయ దేవాలయాల దర్శనాల కోసం సర్వ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలకు రెండు గంటలు, స్పర్శ దర్శనం వీఐపీ బ్రేక్‌ టిక్కెట్‌ పొందినవారికి గంట సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. క్షేత్ర పరిధిలోని ఉద్యానవనాలు, శివాజీ స్పూర్తికేంద్రం, రుద్రపార్కులు చిన్నారుల ఆటపాటలతో కిటకిటలాడాయి. కళారాధన వేదికపై సంప్రదాయ నృత్యాలు, భజన గీతాలతో స్వామి అమ్మవార్లకు కళానీరాజనాలు సమర్పించారు.

భ్రమరాంబకు పల్లకి సేవ

శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి ఆదివారం సాయంత్రం పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి వార పూజల్లో భాగంగా పుష్పాలంకరణ చేసిన పల్లకిలో స్వామి, అమ్మవార్లను ఆసీనులను చేసి పల్లకిలో ఊరేగించారు.

Updated Date - Nov 30 , 2025 | 11:49 PM