మంత్రాలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:30 AM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది.

మంత్రాలయం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. గురువారం వివిధ రాషా్ట్రల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నా వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణతో పాటు విశేష పుష్పాంకరణ సేవ చేశారు. రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన పాల్గుణ చతుర్ధశి గురువారం శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీస్సులతో మఠం పండితులు బృందావనానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, తులసి అర్చన, విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. బంగారు, వెండి, పట్టు వస్ర్తాలు, బెంగళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలు, బంగారు కవచంతో చూడ ముచ్చటగా అలంకరించారు. ఇది భక్తులను ఎంత గానో ఆకట్టుకుంది. పండితులు పూజలు, హస్తోదకం చేసి మహా మంగళహారతులు చేశారు.
రాఘవేంద్ర స్వామి మఠానికి రూ.3 లక్షల విరాళం : మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబయికి చెందిన శశికళ పాటిల్ అనే భక్తురాలు రూ.2 లక్షలు శాశ్వత సేవకు, అదే పట్టణానికి చెందిన కాంచన మంగలవేడి అనే భక్తురాలు రూ.లక్ష సుజయీంద్ర ఆరోగ్య శాలకు విరాళంగా ఇచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్‌లు తెలిపారు. గురువారం వేర్వేరు సమయాల్లో కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని రూ.3 లక్షల నగదును విరాళం ఇచ్చినట్లు చెప్పారు. విరాళం ఇచ్చిన దాత కుటుంబానికి శ్రీమఠం పండితులు రాఘవేంద్ర స్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజరు ఐపీ నరహింహ మూర్తి, సూపర్నిడెంట్ అనంతపురాణిక్, నరసింహ దేశాయ్, గిరిధర్, శ్రీపాద ఆచార్‌లు పాల్గొన్నారు.