పంటలు ఎండిపోతున్నాయ్..!
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:32 AM
లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి. దీనికి కారణం ఎవరు? అన్నదాతను ఆదుకుంటామన్న పాలకులా? లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులా? ఏది జరిగినా నష్టపోయేది మాత్రం అన్నదాతయే.
పది రోజులుగా మరమ్మతులకు నోచుకోని ట్రాన్స్‌ఫార్మర్
విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు
అగసనూరులో రైతుల ఆవేదన
కోసిగి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి. దీనికి కారణం ఎవరు? అన్నదాతను ఆదుకుంటామన్న పాలకులా? లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులా? ఏది జరిగినా నష్టపోయేది మాత్రం అన్నదాతయే. మండలంలోని అగసనూరు గ్రామానికి చెందిన రైతులు శివన్న, నాగేంద్ర, మల్లేష్, విశ్వనాథ్, నాగరాజు, హనుమప్ప, పెద్దభీమన్న, కర్రెప్ప, దేవన్న తమ పొలాల్లో వేసిన పంటలు ఎడుముఖం పట్టడంతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ పదిరోజలు క్రితం కాలిపోయిందని తెలిపారు. నాలుగు రోజుల తర్వాత ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేసి ఏర్పాటు చేసినాఓవర్‌లోడు ఉందని రైతులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని, దీంతో కళ్ల ముందే ఉల్లి, మిరప, వరి పంటలు ఎండు ముఖం పట్టి రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. ఎండుతున్న పంటలను చూసి తట్టుకోలేక రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుత్ అధికారులను కనెక్షన్ ఇవ్వాలని కోరగా ఓవర్‌లోడు ఉందని, మరోసారి ట్రాన్‌ఫార్మర్ కాలిపోదని రాసివ్వాలని కొర్రీలు పెడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరణ: ఇదే విషయంపై విద్యుత్ ఏడీ శాంతి స్వరూప్‌ను ఏఈ వీరేష్‌ను వివరణ కోరగా రైతులు తాము వాడాల్సిన విద్యుత్ కంటే అధిక లోడు బోరు మోటార్లు వాడ డంతో లోడు పడిందన్నారు. అందుకే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని చెప్పడం గమ నార్హం. రైతులను ఇలా బాధపెట్టడంసరి కాదని, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ‘ఆంధ్రజ్యోతి’ అధికారులను కోరగా రైతుల కోసం నీవు పూచీకత్తు ఉంటావా? ట్రాన్స్ ఫార్మర్ మరోసారి కాలిపోకుండా పూచీకత్తు రాసిస్తే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని ఏడీ శాంతి స్వరూప్ చెప్పడం గమనార్హం.
పంటలు కాపాడాలి..
రూ.లక్షలు పెట్టి పంటలు సాగు చేసుకున్నాం. విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ కాలిపోయి పది రోజులైనా అధికారులు చుట్టూ తిరుగుతున్నాం. పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా మాకు కరెంటు ఇచ్చి పంటలను కాపాడాలి. - బారికి నాగేంద్ర, రైతు, అగసనూరు
రైతులంటేనే చిన్న చూపు
రైతులంటేనే అధికారులకు చిన్న చూపు. మేము ఎవరికి చెప్పుకోవాలి.. మాకు అధికారులు ఈవిధం చేస్తున్నారు.కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. - కొడికి కురువ శివన్న, రైతు, అగసనూరు