Share News

పెరుగుతున్న నేరాలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:35 AM

నంద్యాల రైల్వేస్టేషన్‌ పరిధిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు, దొంగతనాలు ఏటా పెరిగిపోతున్నాయి.

పెరుగుతున్న నేరాలు
నంద్యాల రైల్వేస్టేషన్‌

రైల్వేలో ఏటా అధికమవుతున్న ప్రమాదాలు, మరణాలు

రద్దీ ఉంటే రెచ్చిపోతున్న దొంగలు

ఫలితాలు ఇవ్వని రైల్వే అధికారుల చర్యలు

నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల రైల్వేస్టేషన్‌ పరిధిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు, దొంగతనాలు ఏటా పెరిగిపోతున్నాయి. గుర్తుతెలియని మృతదేహాలు సంఖ్య కూడా పెరుగుతోంది. పకడ్బందీగా విధులు నిర్వహించాలనే అధికారుల సూచనలు ఫలితాలు ఇవ్వడం లేదు. రైల్వే ప్రయాణికులు కూడా జాగ్రత్తగా ఉంటే ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుంది. రాత్రిళ్లు ఫుట్‌బోర్డుపై కూర్చొని నిద్రమత్తులోకి జారుకొని జారిపడటంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఈ మధ్య యువకులు రీల్స్‌, ఫొటోల కోసమని రిస్క్‌ చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. మరికొందరు చిన్న గొడవలతో క్షణికావేశానికిలోనై రైల్వే ట్రాక్‌లపై ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు అనాథలు అనేక కారణాల వల్ల రైలు పట్టాలపై ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు.

ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు

నంద్యాల స్టేషన్‌ పరిధిలో గాజులపల్లి చెలమ, బొగద సమీపంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రశాంతిఎక్స్‌ప్రెస్‌, గుంటూరు- కాచిగూడ, తిరుపతి వెళ్లే రైళ్లలో, కంభం, బనగానపల్లి స్టేషన్లలో చోరీలు అధికంగా జరుగుతున్నాయి.

దొంగతనాలకు నిలయాలు

రైల్వేస్టేషన్లు దొంగతనాలకు నిలయాలుగా మారాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దొంగతనాలు తగ్గడం లేదు. ఎక్కువగా రాత్రిళ్లు, పండుగలు, సెలవు దినాల్లో చోరీలు మరింత పెరుగుతున్నాయి. ఆ సమయాల్లో రైళ్లలో ఉండే రద్దీ దొంగలకు అదనుగా ఉంటోంది. అయితే గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రైల్వే పోలీసులు రికవరీ రేటును కూడా పెంచారు. మరింత దృష్టి పెంచి ప్రమాదాలను, చోరీలను అరికట్టాలి.

ప్రమాదాలు, చోరీల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

ఎక్కువగా ప్రమాదాలు, చోరీలు జరుగుతున్న ప్రదేశాల్లో స్పెషల్‌ డ్యూటీస్‌ వేసుకొని నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి కానిస్టేబుల్‌కు బిట్‌ పుస్తకాలు అందజేశాం. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకొని కేసులు ఉన్నాయేమో చెక్‌ చేసుకుంటున్నాం. చాలా వరకు ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - కుమారి, ఎస్‌ఐ, రైల్వేస్టేషన్‌

Updated Date - Dec 28 , 2025 | 12:35 AM