Share News

రసాభాసగా మున్సిపల్‌ సమావేశం

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:53 PM

సమస్యలపై చర్చించాల్సిన పురపాలక సమావేశం రసాభాసగా సాగింది. శనివారం చైర్‌పర్సన్‌ లోకేశ్వరి అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశం
అధికారులను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్‌ సందీప్‌ రెడ్డి, ఎమ్మెల్సీని సన్మానిస్తున్న చైర్‌పర్సన్‌, కమిషనర్‌

సమస్యలు పరిష్కారం కావడం లేదని సభ్యుల ఆవేదన

నిధుల వివరాలు చెప్పాలని డిమాండ్‌

ఆదోని టౌన్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): సమస్యలపై చర్చించాల్సిన పురపాలక సమావేశం రసాభాసగా సాగింది. శనివారం చైర్‌పర్సన్‌ లోకేశ్వరి అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. అభివృద్ది పనులు, సమస్యలను పట్టించుకొనేవారు లేరని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. కౌన్సిలర్‌ వైజీ బాలాజీ మాట్లాడుతూ డిసెంబర్‌లో ఎల్‌ఎల్‌సీ కాలువకు నీటి విడుదల నిలిచిపోతుందని, బసాపురం చెరువ మరమ్మత్తుల కారణంగా నిరుపయోగంగా ఉందన్నారు. ఇక మిగిలిన రాంజల చెరువులో నీరు ఉన్నా, చెరువు లీకేజీలను పట్టించుకొనే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ఎన్నిసార్లు సూచనలు ఇచ్చినా పట్టించుకొనే వారు లేరని ఆరోపించారు. అనంతరం కౌన్సిలర్లు హసీనా, పార్వతి మాట్లాడుతూ తమ వార్డుల్లో మంజూరైన అభివృద్ది పనులు నెలలు గడుస్తున్నా ఎందుకు చేయడం లేదని అధికారులను నిలదీశారు. కమిషనర్‌ కృష్ణ సమాధానం ఇస్తూ గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కొత్త పనులను చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిపారు. కౌన్సిలర్లు బిందు, సందీప్‌ రెడ్డి, రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ది పనులకు రూ.7కోట్ల నిధులను తాను తీసుకొస్తే, వైసీపీ కౌన్సిలన్లు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించడం సరికాదన్నారు. పురపాలక సంఘానికి వచ్చిన నిధుల వివరాలను తమకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉన్నత విద్యావంతులు కావడం అదృష్టంగా భావిస్తున్నామని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కౌన్సిలర్లు రఘు, సందీప్‌ కోరారు. మొదటి కౌన్సిల్‌ సమావేశానికి ఎక్స్‌ ఆఫీషియో మెంబర్‌గా హాజరైన ఎమ్మెల్సీ బీటీ నాయుడును చైర్‌పర్సన్‌, కమిషనర్‌ సన్మానించి పూల మొక్కను బహూకరించారు.

సీఎం దృష్టికి సమస్యలు: ఎమ్మెల్సీ బీటీ నాయుడు

పట్టణ ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. బసాపురం చెరువుకు శాశ్వత మరమ్మతులకు రూ.70కోట్లు అవసమని అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. అలాగే టిడ్కో గృహాల పనులు, నూతన వంతెన నిర్మాణానికి సంబంధిత మంత్రులతో చర్చించి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వచ్చే నెల శాసన మండలి సమావేశాలలో సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - Aug 30 , 2025 | 11:53 PM