పత్తికి కూలీల పాట్లు
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:36 PM
పత్తి రైతులకు కూలీలు దొరకడం లేదు. కర్నూలు జిల్లాలో దాదాపు 2.17వేల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు.
పత్తి తీతకు ఆకాశన్నంటుతున్న కూలి రేట్లు
గతంలో రూ.7 .. ప్రస్తుతం రూ.15కు పెంపు
కూలి పెంచినా దొరకని కూలీలు
జిల్లాలో 2.17వేల హెక్టార్లలో సాగు
వర్ష భయంతో రైతు గుండెల్లో దడ
ఆదోని, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు కూలీలు దొరకడం లేదు. కర్నూలు జిల్లాలో దాదాపు 2.17వేల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. ఆదోని సబ్‌డివిజన్‌లో 67వేల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేశారు. ఆదోని ప్రాంతంలో కూలీల కొరత ఏస్థాయిలో ఉందంటే.. కూలి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ఏడాది కిలో పత్తి పంటతీతకు కేవలం రూ.7ఇస్తే సరిపోయేది. కానీ ఈ సంవత్సరం కూలీ డిమాండ్ దృష్ట్యా ఆరేటును రైతు లు కళ్లు మూసుకుని రూ.13 నుంచి రూ.15 వరకు పెంచారు. దాదాపుగా రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగినా, కూలీలు దొరకక పత్తితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ వర్షం కురిసినా ఇక్కడి రైతులు భయం భయంగా గడుపుతున్నారు. పత్తి పంటలకు అధిక పెట్టుబడి పెట్టడం, పెరిగిన కూలీ రేటుతో సతమతమవుతుంన్న రైతును వాతావరణం మరింత భయపెడుతోంది. వర్షం ముప్పు రైతుల గుండెల్లో దడ పెడుతోందని, వర్షం పడితే.... పత్తి పంట మొత్తం నేలపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట తీయడానికి మనిషి దొరక్క చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనమవుతుందేమోనని భయమేస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. రోజులు గడిచే కొద్దీ పొలంలో దూది నేలరాలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే అప్పులు చేసి లక్షలు వెచ్చించి పండించిన పంటను నేలకే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడితే... తమ బతుకులు రోడ్డున పడతాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘ఉపాధి’, ఇతరత్రా పనుల వైపు..
పత్తి తీసే యంత్రాలు అందుబాటులో లేకపోవడం, ఉపాధి హామీ పనులు, ఇతరత్రా పనుల వైపు కూలీలు మళ్లడంతో ఈ సంక్షోభం మరింత పెరిగిందని రైతులు చెబుతున్నారు. తక్షణమే జిల్లా అధికారులు చొరవ తీసుకుని, ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించడానికి లేదా తగిన ప్రత్యామ్నాయాలు చూపడానికి చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే ఈ ఏడాది పత్తి పంట పండించిన రైతులకు నష్టాల తిప్పలు తప్పేలా లేవు.
సిరుగుప్ప నుంచి 30 మంది కూలీలను..
ఆరు ఎకరాల్లో పత్తి సాగుచేశా. ఏడు రోజులైంది. కూలీల కోసం ఊరంతా తిరుగుతున్నా... ఏ ఒక్క కూలి దొరకడం లేదు. కూలి డబ్బులు ఎంతైనా ఇస్తామంటున్నా రైతులను అడిగేవారే లేరు. చివరికి కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప నుంచి 30 మంది కూలీలను సొంత వాహనాన్ని ఏర్పాటు చేసి తీసుకొచ్చా. ఒక్క కేజీ పత్తి తీతకు రూ.15 ఇస్తున్నా.
- నజీర్, రైతు, సంతేకూడ్లూరు
పెట్టుబడులు నేలపాలవుతాయని..
నాలుగెకరాల్లో పత్తిని సాగు చేశా. వర్షాలు ఎక్కువ కురవడంతో పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా పత్తికి కూలీలు దొరకడం లేదు. వర్షం వస్తే మాత్రం పత్తి పట నేలరాలుతుంది. పెట్టిన పెట్టుబడులంతా నేలపాలవుతాయని భయమేస్తోంది. వర్షం పడిందా మా బతుకులు మట్టిపాలే...
నాగప్ప, రైతుల, హోళగుంద