Share News

పత్తి రైతుల ఆగ్రహం

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:17 AM

నాణ్యతగా లేదని అమ్మకానికి తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు తిరస్కరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

పత్తి రైతుల ఆగ్రహం
సీసీఐ అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు

సీసీఐ అధికారులను అడ్డుకున్న అన్నదాతలు

జాతీయ రహదారిపై ఆందోళన

ఎమ్మిగనూరు/ నందవరం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నాణ్యతగా లేదని అమ్మకానికి తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు తిరస్కరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఎమ్మిగనూరులో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచి రాకపోకలు స్తంభించాయి. బెళగల్‌, నాగలదిన్నె, చిలకలడోన, కనకవీడు, దేవనకొండ,పెద్దనేలటూరు, దైవందిన్నె, పత్తికొండ, కుంకనూరు, మాచాపురంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 50మంది పత్తిరైతులు సీసీఐకి విక్రయించేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకొని ఎమ్మిగనూరు, మంత్రాలయం రోడ్డులోని ముగతి గ్రామ సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి (మురారిజిన్నింగ్‌ ఫ్యాక్టరీ)కి తీసుకొచ్చారు. ఇందులో సాయంత్రం 8 మంది రైతుల పత్తి నాణ్యతసరిగా లేదని సీసీఐ అధికారులు తిరస్కరించారు. ఎంతో దూరం నుంచి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తే పత్తిని తీసుకోక పోగా ఇప్పుడు తిరస్కరించటం ఏమిటని రైతులు సీసీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు రెండుగంటల పాటు ర్యాలీ చేయడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అంతేగాక జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ అధికారులు ఉన్న కార్యాలయాన్ని ముట్టడించారు. పత్తిని ఎందుకు కొనుగోలు చేయటం లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న ఎమ్మిగనూరు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు, నందవరం స్టేషన్‌ ఇన్‌చార్జి కోదండరామిరెడ్డి, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పత్తి రైతులకు మద్దతుగా సీపీఐ నాయకులు రంగన్న, మల్లికార్జున గౌడ్‌, రవి, నరసింహులు నిలిచారు. రైతులు ఆందోళన విరమించకపోవడంతో సీసీఐ అధికారులు శివరాముడు, మంగే్‌ష ఎనిమిది వాహానాల్లో ఉన్న పత్తిని మరోసారి పరిశీలించి నాలుగు వాహానాల్లో పత్తిని కొనుగోలు చేశారు. మిగతా నాలుగు వాహానాల్లో ఉన్న పత్తిని మరో మిల్లుకు తరలించి అక్కడ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సీసీఐ అధికారి శివరాముడు మాట్లాడుతూ సీసీఐ గుంటూరు అధికారుల ఆదేశాలమేరకే పత్తి నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేస్తున్నామన్నారు. పత్తి నాణ్యత లేకపోవటం వల్లే రిజెక్టు చేయాల్సి వచ్చిందాన్నరు.

Updated Date - Dec 19 , 2025 | 12:17 AM