Share News

రవాణా శాఖ అవినీతిమయం

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:37 AM

ప్రజా పాలనకు పారదర్శకతను మించిన గీటురాయి ఉండదు. అది లోపిస్తే అవినితి ఊబిలో యంత్రాంగం కూరుకు పోయినట్లే. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయికి చేరుకుందనే విమర్శ తీవ్రస్థాయిలో వినిపిస్తోంది. మేం ఇంతే.. అన్న రీతిలో అధికారులు ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నారు.

రవాణా శాఖ అవినీతిమయం
నంద్యాల రవాణా శాఖ కార్యాలయం

ప్రతి పనికి రూ.300 వసూలు?

అధిక లోడ్‌ లారీలకు నెలకు రూ.12వేలు డిమాండ్‌

ప్రభుత్వ ఆదాయానికి గండి

మధ్యవర్తుల ద్వారా వసూళ్లు

వాహనదారుల ఇబ్బందులు

నంద్యాల టౌన్‌ ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలనకు పారదర్శకతను మించిన గీటురాయి ఉండదు. అది లోపిస్తే అవినితి ఊబిలో యంత్రాంగం కూరుకు పోయినట్లే. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయికి చేరుకుందనే విమర్శ తీవ్రస్థాయిలో వినిపిస్తోంది. మేం ఇంతే.. అన్న రీతిలో అధికారులు ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అఽధికారులు, మధ్యవర్తులు (ఏజెంట్లు) కార్యాలయం చుట్టూ పనుల కోసం తిప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నంద్యాల జిల్లా రవాణా కార్యాలయం అవినీతికి చిరునామాగా మారిందని అంటున్నారు. ఈ స్థితిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం...

నంద్యాల జిల్లా రవాణా కార్యాలయంలో ఎన్నిసార్లు ఏసీబీ దాడులు జరిగినా వారిలో మార్పు రావడం లేదు. వాహన దారులను ఇబ్బందులకు గురి చూస్తూ అక్రమ వసూళ్లకు పాల్ప డుతున్నారు. అటెండర్‌ నుంచి ఉన్నతాఽఽధికారుల వరకు అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే అధికారుల ఆదాయమే ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

జిల్లా రవాణా కార్యాలయంలో ఇలా...

జిల్లాలో నంద్యాల డీటీవో కార్యాలయం, డోన్‌ ఎంవీఐ, ఆత్మకూరు ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో లారీలు సుమారుగా వెయ్యి నుంచి 1,200 లారీలు ఉన్నాయి. వీటిలో నేషనల్‌ పర్మింట్‌ పొందాల్సినవి సుమారుగా 400 ఉంటాయి. వీటిలో ట్యాక్స్‌ కట్టని వాటికి నంద్యాల ఆర్టీవో కార్యాల యంలో ఒక్కో లారీకి రూ. 16,500 వాహనదారుడు కట్టాలి కానీ, నంద్యాల ఆర్టీవో గత ఏడాది నుంచి వాహనం తిరగ లేదని వాహనదారుడి నుంచి రూ.5300 చొప్పన తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

నంద్యాలకు లారీలు హెవీ లోడుతో వస్తుంటాయి. ముందుగానే మధ్యవర్తులు వెళ్లి నెలకు రూ.12000 చెల్లిస్తే నీ వాహనం నంద్యాల జిల్లా పరిఽధిలో ఎక్కడా పట్టుబడకుండా చూస్తామని ఒక టోకన్‌ నెంబర్‌ ఇస్తారు. నంద్యాల ఎక్కువగా తంబరాజు పల్లె నుంచి గ్రావె ల్‌, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, తాడిపత్రి నుంచి ఇసుక లారీలు, జేఎస్‌ డబ్ల్యూ నుంచి వచ్చే సిమెంట్‌ లారీలు ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల బనగానలపల్లె, డోన్‌ నుంచి వచ్చే లారీలు నంద్యాల ఆర్టీవో కార్యాలయానికి నెలకు రూ.12000 ముట్టజెప్పాలి లేని పక్షంలో లారీ యజమాన్ని ముప్ప తిప్పలు పెడతారు.

నంద్యాల రవాణా కార్యాలయంలో రోజుకు లావాదేవీలు 300 దాకా వరకు జరుగుతున్నాయి. వీటికి ప్రతి వ్యవహారానికి రూ.300 వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రవాణా కార్యకాలాపాలన్నీ వేరే పోర్టల్‌ ద్వారా జరిగేవి. కూటమి ప్రభుత్వం వాహన యాప్‌ ద్వారా చేయాలని సూచించింది. అయితే వాహనదారులు వాటిని మార్చడానికి మండలం, ఈవేవైసీ, ట్రాన్స్‌ఫర్‌ అఫ్‌ ఓనర్‌ ఇలా జరిగి ప్రతి వ్యవహారానికి అన్ని పత్రాలు ఉన్నా రూ.300 చెల్లిం చాలి. ఏజెంటు ద్వారా కలెక్ట్‌ చేసి అధికారులకు పర్సెంటేజీ ప్రకారం పంచుతారు. ఇలా లంచాలు రోజుకు సుమారుగా రూ.1.5 ల క్షల్లో వసూలు చేసుకుని పంచుకుంటున్నారు.

రవాణా కార్యాలయంలో జరిగినవి..

నంద్యాల జిల్లా రవాణా కార్యాలయంలో ఇప్పటికి పలుమార్లు ఏసీబీ అఽధికారులు దాడులు చేసినా వారిలో ఎటువంటి మార్పులు రాలేదు. గతంలో కొన్నేడ్ల కిందట ఒక ఎంవీఐ వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి జైలుకు వెళ్లాడు.

గతేడాది ఇక్కడే పని చేసి మరో ఏంవీఐ కర్నూలు రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పని చేస్తూ అక్రమ రవాణ, లంచం తీసుకున్న కేసులో ఏసీబీకి చిక్కి జైలు పాలయ్యాడు.

గతేడాది నంద్యాల ఆర్టీవో కార్యాలయంలో పని చేస్తున్న ఏవో అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కి జైలుకు వెళ్లారు. అయినప్పటికీ వీరిలో మార్పు రావడం లేదు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో ఇక్కడ పని చేసిన క్లర్క్‌ రూ.2,500లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆయన ప్రస్తుతం ఆదే కార్యాలయంలో పని చేస్తుండడం గమనార్హం.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

నంద్యాల డీటీసీ కార్యాలయ పరిఽధిలో వాహనదారులు ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం లేదు. అధికారులు ఎవరైనా అలా అడిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాహనదారుకుల కూడా పరిమితి మించిన లోడుతో వెళ్లరాదు. - కృష్ణవేణి, జాయింట్‌ టాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌

Updated Date - Apr 22 , 2025 | 12:37 AM