కర్నూలు జీజీహెచ్‌లో వివాదం
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:46 AM
కర్నూలు జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవులు మధ్య వివాదం రగులుకుంటోంది.
సూపరింటెండెంట్ వర్సెస్ ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవులు మధ్య వివాదం రగులుకుంటోంది. ఆసుపత్రిలో అభివృద్ధి పనుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఏకంగా సమీక్ష సమావేశం నుంచి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఈఈ) బయటకు వెళ్లే వరకు వచ్చింది. బుధవారం కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో రూ.45 లక్షలతో నెఫ్రాలజీ, యురాలజీ, న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్ల మరమ్మతుల పనులు, ఇతర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఆపరేషన్ థియేటర్ల పనులు ఆలస్యం అవుతున్నాయనీ, దీని వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నాలుగు నెలలుగా పనులు సాగుతున్నాయనీ, గతంలో పని చేసిన ఇన్‌చార్జి ఈఈ కరీముల్లా వేగంగా స్పందించేవారనీ సూపరింటెండెంట్ చెప్పడంతో ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ తీవ్ర అసహనానికి గురయ్యారు. పనుల నాణ్యతపై తనకు చెప్పకుండా ఏకంగా ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీకీ ఎలా ఫిర్యాదు చేస్తారని ఈఈ ప్రశ్నించారు. తన సర్వీసు 35 సంవత్సరాలు ఉందని, తన ముందే గతంలో పని చేసిన ఇంజనీర్ అధికారిని పొగడటం ఏమిటన్నారు. ఏకవచనంతో పిలుస్తారా? అంటూ వాదనకు దిగారు. గతంలో పని చేసిన కరీముల్లాతోనే పనులు చేయించుకోండి అంటూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం జీజీహెచ్ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.