Share News

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ: ఎస్పీ

ABN , Publish Date - May 09 , 2025 | 12:22 AM

సాంకేతిక పరి ఙ్ఞానంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ: ఎస్పీ

నంద్యాల టౌన్‌, మే 8(ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరి ఙ్ఞానంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు. గురువారం రామకృష్ణ పీజీ కళాశాలలో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఎవిడెన్స్‌ మేనేజ్‌మెంట్‌పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ నేరం చేసిన వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకోకుండా నేర స్థలంలో సాక్ష్యాధారాలు సేకరణ వాటి భద్రతా ప్రమాణాలు ఎలా పాటించాలి అనే విషయాలపై శ్రద్ధ ఉంచాలన్నారు. కేసుల దర్యాప్తు విషయంలో తప్పుదోవ పట్టించేందుకు నేరగాళ్లు సాంకేతికంగా కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ తరగతులు అన్ని విభాగాలకు సంబంధించిన నిష్ణాతులైన వారితో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా నేర పరిశోధన సమయంలో ఆమోదయోగ్యమైన సాక్ష్యం, నేర ప్రక్రియ, వంటి చట్టపరమైన ప్రమాణాలు పాటించాలన్నారు. డీఎన్‌ఏ విశ్లేషణ వేలిముద్రలు, రక్తపు మరకల నమునాలు, తుపాకీలు, బాలిస్టిక్స్‌, టాక్సికాలాజీ, మైక్రోస్కోపి, అగ్ని శిథిలాల విశ్లేషణ వంటి వాటిలో సాంకేతిక పరిఙ్ఞానం ఉపయోగించి సాక్షాధారాలు సేకరించాలని సూచించారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని కేసుల్లో మంచి పురోగతి సాధించాలన్నారు. ఈ శిక్షణా తరగతులకు సీఐలు, స్టేషన్‌ రైటర్లు వచ్చారు. కార్యక్రమంలో నంద్యాల సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ మంద జావళి, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ అసిస్టెంట్‌లు డాక్టర్‌ అసింబాషా, డా.కష్ణకుమార్‌ రెడ్డి, శ్యాంప్రసాద్‌, కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:22 AM