Share News

‘పవర్‌గ్రిడ్‌’కు సహకరించండి

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:41 PM

: పవర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు భూములు ఇచ్చి సహకరించాలని పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌ రైతులను విజ్ఞప్తి చేశారు.

‘పవర్‌గ్రిడ్‌’కు సహకరించండి
ఆలూరు మండలం మనెకుర్తి గ్రామంలో ఆర్డీవో భరత్‌నాయక్‌కు వినతి పత్రం అందజేస్తున్న రైతులు

పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌

భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన మనెకుర్తి రైతులు

ఆలూరు రూరల్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పవర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు భూములు ఇచ్చి సహకరించాలని పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌ రైతులను విజ్ఞప్తి చేశారు. ఆలూరు మండలం మనెకుర్తి గ్రామంలో గురువారం పవర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా ప్రయోజనం కోసం పవర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఎకరాకు రూ.18 లక్షలు ఇస్తుందని, భూములు ఇవ్వలేని పక్షంలో జనరల్‌ యాక్టు కింద పరిహారం ఇస్తారని ఆర్డీఓ చెప్పడంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనెకుర్తి గ్రామ రైతులు వెంకటేష్‌, నాగరాజు, కృష్ణ, దేవేంద్ర మాట్లాడుతూ కన్నతల్లి లాంటి సారవంతమైన భూములను పవర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. పంట పొలాలపై ఆధారపడి జీవిస్తున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పవర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు తమ భూములు ఇవ్వమని ఆర్డీఓతో రైతులు వినతిపత్రం అందించారు. సారవంతమైన భూములు కాకుండా ప్రాజెక్టు డీపీని మార్చి వేరే ప్రాంతాల్లో పవర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని టీడీపీ రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి అన్నారు. రైతులకు న్యాయం జరిగేలా అధికారులు చొరవ చూపాలన్నారు. రైతుల భూములను పవర్‌గ్రిడ్‌కు అప్పగిస్తే ఉద్యమం తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు హనుమంతు, సీపీఐ జిల్లా నాయకుడు కాక భూపేష్‌ ఆర్డీఓ భరత్‌నాయక్‌కు వినతి పత్రం అందించారు. నాలుగు నెలలుగా రైతులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 80 శాతం రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలన్నారు. మనెకుర్తి, కమ్మరచేడు, హులేబీడు రైతుల జోలికి వస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శోభసువర్ణమ్మ, సీఐ రవిశంకర్‌రెడ్డి, ఆర్‌ఐ బసవన్నగౌడ్‌, సర్పంచ్‌ కొల్లమ్మ, ఎస్‌ఐలు మహబూబ్‌బాషా, దిలీప్‌కుమార్‌, మారుతి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:41 PM