యోగాతో ఆత్మవిశ్వాసం
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:17 PM
యోగాసనాలతో ఆత్మవిశ్వాసం కలుగుతుందని, తద్వారా తేజోవంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కలుగుతాయని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ రాజకుమారి
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): యోగాసనాలతో ఆత్మవిశ్వాసం కలుగుతుందని, తద్వారా తేజోవంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కలుగుతాయని కలెక్టర్ రాజకుమారి అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డులో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా, జేసీ విష్ణుచరణ్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వివిధ విభాగాల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొని గంట పాటు యోగసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 550 ప్రదేశాల్లో 9 లక్షల మంది యోగాంఽధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. యోగా కార్యక్రమంపై జిల్లా స్థాయిలో వివిధ రకాల పోటీలను నిర్వహించామన్నారు. జిల్లాలో తయారు చేసిన వీడియోకు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించిందన్నారు. బనగానపల్లె బృందం తయారుచేసిన స్ర్కిప్ట్‌కు రాష్ట్రస్థాయిలో మూడో బహుమతి వచ్చిందని, యోగాంధ్రపై ఆరు ఉత్తమ గేయాలను అప్‌లోడ్ చేశామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో విజయదుర్గ బృందం సభ్యులు ప్రధానమంత్రి మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రశంసాపత్రం అందుకున్నారని తెలిపారు.