Share News

లోడింగ్‌ కోసం పోటాపోటీ

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:40 PM

జిల్లాలో తుంగభద్ర, వేదావతి నదుల్లో గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వినియోగదారులకు ఇసుక లోడింగ్‌ కాంట్రాక్ట్‌ కోసం మైనింగ్‌ అధికారులు టెండర్లు పిలిచారు

లోడింగ్‌ కోసం పోటాపోటీ
హొళగుంద మండలం వేదవతి నదిలో ఇసుక తవ్వకాలు(ఫైల్‌)

నాగులదిన్నె, జోహరాపురం, ముద్దటమాగి రీచ్‌లకు టెండర్లు

22మంది కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖాలు

25న ఓపెన్‌ చేయనున్న మైనింగ్‌ అధికారులు

కర్నూలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుంగభద్ర, వేదావతి నదుల్లో గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వినియోగదారులకు ఇసుక లోడింగ్‌ కాంట్రాక్ట్‌ కోసం మైనింగ్‌ అధికారులు టెండర్లు పిలిచారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల అండతో ఈ టెండర్లు దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు పైరవీలు చేశారు. సిండికేట్‌ బెడిసికొట్టిందో? మరే ఇతర కారణమో వారికే ఎరుక. చివరి రోజు గురువారం పోటాపోటీ మూడు రీచ్‌లకు 22మంది కాంట్రాక్టర్లు టెండరు షెడ్యూళ్లు దాఖలు చేయడం కొసమెరుపు. తుంగభద్ర నదిలో నందవరం మండలం నాగులదిన్నె రీచ్‌లో 1.20లక్షల మెట్రిక్‌ టన్నులు, గంగావరం-జోహాపురరం రీచ్‌లో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు, వేదావతి నదిలో హోళగుంద మండలం ముద్దటమాగి రీచ్‌లో 75 వేలు మెట్రిక్‌ టన్నులు ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఈరీచ్‌లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వినియోగదారులకు టిప్పర్లు, ట్రాక్టర్లు, లారీల్లో లోడింగ్‌ చేసేందుకు ఒక్కో టన్నుకు రూ.45ల ప్రకారం వినియోగదారుడి నుంచి వసూలు చేసేలా ప్రభుత్వం ధర నిర్ణయించింది. మూడు రీచ్‌లో 3.45లక్షల మెట్రిక్‌ టన్నులు ఇసుక లోడింగ్‌ కాంట్రాక్ట్‌ విలువ సుమారు రూ.1.55కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈనెల 10వ తేదీన టెండర్‌ నోటీస్‌ జారీ చేస్తే బుధవారం వరకు ఒక్క షెడ్యూల్‌ కూడా దాఖాలు చేయలేదు. చివరి రోజు గురువారం నాగులదిన్నె రీచ్‌కు 11, గంగావరం-జొహరాపురం రీచ్‌కు ఆరు, ముద్దటమాగి రీచ్‌కు ఐదు చొప్పున 22 టెండరు షెడ్యూళ్లు దాఖాలు చేశారు. ఈనెల 25న టెక్నికల్‌, ప్రైజ్‌ బిడ్‌ ఓపెన్‌ చేస్తామని గనులు భూగర్భ వనరులు (మైనింగ్‌) శాఖ డీడీ రవిచంద్ర ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌వోఐ) ఇచ్చిన మూడు రోజుల్లోగా లోడింగ్‌ టెండర్‌ కాస్ట్‌ విలువపై పదిశాతం చొప్పున నాగులదిన్నె రీచ్‌కు రూ.5.10లక్షలు, గంగావరం-జొహరాపురం రీచ్‌కు రూ.6.75లక్షలు, ముద్దటమాగి రీచ్‌కు రూ.3.37 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి. ఆ తరువాత మైనింగ్‌ నిబంధనలు మేరకు ఒప్పందం చేసుకొని టెండరు దక్కించుకున్న రీచ్‌ల్లో ఇసుక లోడింగ్‌ ప్రక్రియ చేపట్టవచ్చని అధికారులు తెలిపారు.

Updated Date - Oct 23 , 2025 | 11:46 PM