నత్తతో పోటీ..!
ABN , Publish Date - May 09 , 2025 | 12:30 AM
హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణకు గతంలో టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులకు స్పీడ్‌బ్రేక్ పడింది. రూ.6,182 కోట్లతో 6,300 క్యూసెక్కులకు విస్తరిస్తామంటూ టెండర్లు పేరిట మాయ చేసింది.
జిల్లాలో రూ.690 కోట్లతో హంద్రీనీవా విస్తరణ పనులు
సబ్ కాంట్రాక్టర్లదే హవా.. కనిపించని పురోగతి
జూన్ 10లోగా పూర్తి చేయాలని లక్ష్యం
హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణకు గతంలో టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులకు స్పీడ్‌బ్రేక్ పడింది. రూ.6,182 కోట్లతో 6,300 క్యూసెక్కులకు విస్తరిస్తామంటూ టెండర్లు పేరిట మాయ చేసింది. గంపెడు మట్టి తీయకుండా ఐదేళ్ల పాటు రైతులకు తీరని అన్యాయం చేశారు. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో కొలువుదీరిన ప్రభుత్వం రాయలసీమ కరువు పల్లెసీమలను సస్యశ్యామలం చేయడానికి వీలైనంత ఎక్కవ కృష్ణా వరద జలాలు మళ్లించేందుకు విస్తరణ బ్యాలెన్స్ పనులు చేపట్టింది. జూన్ 10లోగా పూర్తి చేయాలని లక్ష్యం. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పురోగతి నత్తతో పోటీ పడుతుందని తెలుస్తుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. జూలైలో వరదలొస్తే కాలువకు కృష్ణా జలాలు ఎత్తిపోయాల్సి వస్తుంది. పనులు పూర్తి చేయకపోతే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం లక్ష్యం ‘కృషా’్ణర్పాణం అవుతుంది. ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్ట్ సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చి గడువులోగా పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, మే 8 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలు ఏటేటా వేల టీఎంసీలు కడలిపాలు అవుతున్నాయి. ఆ నీటిని ఎత్తిపోస్తే నిత్యం కరువుతో తల్లడిల్లే రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చని 1983లో అధికారం చేపట్టిన ఎన్టీఆర్ భావించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) నిర్మాణానికి బీజం వేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం ఎన్టీఆర్ మార్గాన్నే అనుసరించాయి. 25 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఫేజ్-1 పనులు పూర్తిచేశారు. 2013లో తొలిసారిగా హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఎత్తిపోశారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05లక్షల ఎకరాలకు సాగు, 35లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంగా శ్రీశైలం జలాశయం ఎగువన 40 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంది. అందుకోసం 3,850 క్యూసెక్కుల ఎత్తిపోసేందుకు వీలుగా ప్రధాన ఎత్తిపోతల పథకం మాల్యాల లిఫ్ట్ సహా 8 ఎత్తిపోతల పథకాలు వద్ద 12 పంపులు ఏర్పాటుచేశారు. అయితే ఆ సామర్థ్యంలో కాలువను నిర్మించలేదు. దీంతో 2 వేల క్యూసెక్కులు కూడా ఎత్తిపోయలేని పరిస్థితి ఉంది. గడిచిన 12 ఏళ్లలో హంద్రీనీవాకు కృష్ణా జలాలు ఎత్తిపోతల రికార్డులు పరిశీలిస్తే.. 2016-17లో 32.071 టీఎంసీలు. 2018-19లో36.908 టీఎంసీలు, 2019-20లో 40.013 టీఎంసీలు, 2020-21లో 39.576 టీఎంసీలు తీసుకున్నారు. ఈ నాలుగేళ్లలో కూడా వరద రోజులు ఎక్కువగా ఉండడంతో టార్గెట్‌కు కొంత అటుఇటుగా తీసుకున్నాం. మిగిలిన సమయంలో అత్యల్పంగా 7.80 టీఎంసీలు, గరిష్టంగా 28-29 టీఎంసీలు తీసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వరద జలాలు కరువు నేలకు మళ్లించాలంటే 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువను విస్తరించాలని 2017-18లో అప్పటి సీఎం చంద్రబాబు రూ.1,030 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు కొనసాగించి ఉంటే కరువుసీమకు నీటి ప్రయోజనం కలిగి ఉండేది. వైసీపీ హయాంలో ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా కరువు రైతులు తీవ్రంగా నష్టపోక తప్పలేదు.
విస్తరణ పనుల్లో కానరాని పురోగతి
ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం చంద్రబాబు హంద్రీనీవా విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఫేజ్-1 పరిధిలో రూ.690 కోట్లతో పనులు చేపట్టారు. ప్యాకేజీ-1 కింద రూ.260 కోట్లతో చేపట్టే 0/0 నుంచి 88 కిలోమీటర్ల వరకు విస్తరణ పనులను మెగా ఇన్‌ఫ్రా సంస్థ, ప్యాకేజీ-2 కింద రూ.430 కోట్లతో చేపట్టిన 88 కి.మీలు నుంచి 201 కిలో మీటర్లు వరకు విస్తరణ పనులు డీఎస్‌ఆర్-వీపీఆర్ సంస్థలు జాయింట్ వెంచర్‌గా పనులు దక్కించుకున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూన్ 10లోగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలకు లక్ష్యాలను నిర్దేశించింది. మిగిలిన గడువు 31 రోజులే. ఇప్పటికే పనులు మొదలు పెట్టి నెలన్నర దాటింది. 20-25 శాతం కూడా పురోగతి లేదు. మొదట్లో ఏర్పాట్లు వల్ల ఆలస్యమైనా పుంజుకున్నాయా...? అంటే అదీ లేదు.
సబ్ కాంట్రాక్టర్ల పెత్తనం
హంద్రీనీవా విస్తరణ పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్ట్ సంస్థలు ప్యాకేజీలుగా విభజించి సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. సబ్ కాంట్రాక్టర్లతో ఆ స్థాయిలో యంత్ర సామగ్రి లేకపోవడంతో పనులు మందగించాయి. ప్యాకేజీ-1 పనులు చేపట్టిన మెగా ఇన్‌ఫ్రా సంస్థలో పనిచేసే కీలక అధికారి ఒకరు ఓ సబ్ కాంట్రాక్టరును బినామీగా పెట్టుకొని పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మిషనరీ కూడా అంతంతగానే ఉండడంతో వేగంగా పనులు జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించిన ఇంజనీర్లపై ఉన్నతాధికారులుకు ఫిర్యాదులు చేసి చీవాట్లు పెట్టిస్తున్నట్లు సమాచారం. దీంతో మాకెందుకు అంటూ క్షేత్రస్థాయి పర్యవేక్షించే ఇంజనీర్లు కొందరు పట్టించుకోవడం లేదు. ప్యాకేజీ-2లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది.
హంద్రీనీవా కాలువకు ఎత్తిపోసిన వరద జలాల వివరాలు (టీఎంసీల్లో)
సంవత్సరం లిఫ్ట్ చేసినది
2012-13 2.00
(ట్రయల్ రన్)
2013-14 9.904
2014-15 16.806
2015-16 7.798
2016-17 32.071
2017-18 28.705
2018-19 36.908
2019-20 40.013
2020-21 39.576
2021-22 26.841
2022-23 23.747
2023-24 32.333
2024-25 28.198
గడువులోగా పూర్తి చేస్తాం
హంద్రీనీవా విస్తరణ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత కాంట్రాక్టర్లలో కూడా చలనం వచ్చింది. అవసరమైన మేరకు ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లు సమకూర్చారు. ఎట్టిపరిస్థితుల్లో జూన్ 10లోగా పూర్తి చేసేలా వేగంగా పనులు చేయిస్తున్నాం. 25 శాతానికి పైగా పురోగతి సాధించాం.
- పాండురంగయ్య, ఎస్‌ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు, కర్నూలు