రైతులందరికీ పరిహారం వచ్చేలా కృషి
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:04 AM
సోలార్ పరిశ్రమ నిర్మాణంతో సాగు భూములు కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి
పాణ్యం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): సోలార్ పరిశ్రమ నిర్మాణంతో సాగు భూములు కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గ్రీన్‌కో కంపెనీ పిన్నాపురంలో చేపట్టిన సోలార్ పరిశ్రమ నిర్మాణంలో ప్రభుత్వ సాగు భూములు కోల్పోయిన రైతులతో సర్పంచ్ వెంకటకృష్ణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు నిర్వహిం చారు. 2019లో గ్రీన్‌కో సంస్థకు 2467.28 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించామన్నారు. ఈ భూమిలో ఎవరూ సాగులో లేనట్లు రికార్డుల్లో ఉండడంతో సంస్థకు కేటాయించామన్నారు. రికార్డులు లేకుండా పూర్వం నుంచి సాగుచేసుకుంటున్న రైతులకు న్యాయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసి 197 మంది రైతులను గుర్తించి జాబితా తయారు చేశామన్నారు. ఇందులో ఐదెకరాల వరకే పరిహారం ఇవ్వడానికి పరిమితి అన్నారు. జాబితాలోని రైతుల వివరాలను బహిరంగంగా తహసీల్దార్ చదివి వినిపించారు. కొందరు రైతులు తమ పేర్లు జాబితాలో లేవని ఆందోళన వ్యక్తంచేశారు. జాబితాలో పేర్లు లేని రైతుల అర్జీలు తీసుకొని తప్పనిసరిగా నష్టపరిహారం అందించ డానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పాణ్యం సీఐ కిరణ్ కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు నరేంద్రకుమార్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, ఆర్‌ఐ రాము, సర్వేయరు నాగరాజు, వీఆర్వోలు బీరేంద్ర, శ్రీనివాసులు, శంకర్, ఏఆర్ పోలీసులు, రైతులు పాల్గొన్నారు.
మొదటి లిస్టులో పేరుంది
గతంలో రెవెన్యూ అధికారులు ప్రచురించిన జాబితాలో నాపేరు ఉంది. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో నాపేరు లేదు. నాకు 50సెంట్ల ప్రభుత్వ భూమికి నష్ట పరిహారం అందాల్సి ఉంది. గ్రామసభలో ప్రకటించే వారికి మాత్రమే నష్టపరిహారం అందిస్తే నష్టపోతాను. కొన్నేళ్లుగా ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్నాను.
ఓర్వకంటి నాగలక్ష్మన్న, పిన్నాపురం
సాగులో ఉన్నా జాబితాలో పేరు లేదు
మా పూర్వీకుల కాలం నుంచి ప్రభుత్వ భూమి రెండెకరాలు సాగు చేసుకుంటు న్నా. ఇప్పుడు అధికారులు ప్రకటించిన జాబితాలో నా పేరులేదు. నాకు నష్ట పరిహారం ఇవ్వాలి. పంట సాగును అధికా రులు గుర్తించకపోవడమే ఇందుకుకారణం. బిజ్జమ్మగారి వెంకటరాముడు, పిన్నాపురం