కమిషనర్ వర్సెస్ ఆర్‌వో
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:59 PM
నగర పాలక కార్యాలయంలో కమిషనర్ పి.విశ్వనాథ్, ఇన్‌చార్జి రెవెన్యూ ఆఫీసర్(ఆర్‌వో) వాజిద్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
షోకాజ్ నోటీసు ఇస్తాం: కమిషనర్
సస్పెండ్ చేయండి
ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటా: ఆర్‌వో
రాజీ కుదిర్చిన మేయర్
సద్దుమణిగిన వివాదం
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): నగర పాలక కార్యాలయంలో కమిషనర్ పి.విశ్వనాథ్, ఇన్‌చార్జి రెవెన్యూ ఆఫీసర్(ఆర్‌వో) వాజిద్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శనివారం రెవె న్యూ విభాగానికి సంబంధించి కమిషనర్ సమావేశం ఏర్పాటుచేశారు. రెవెన్యూ వసూళ్లపై ఆర్‌వోను ఆరాతీశారు. ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారు. గత సంవత్సరం ఎంత? అంతకుముందు ఎంత చేశారు? వాటికి సంబంధించిన వివరాలివ్వాలని ఆర్‌వోను కమిషనర్ కోరారు. అలాంటి వివరాలు ఏమి అవసరం లేదని, ఆపరేటర్ ఇమ్మని చెప్పినా ఇవ్వలేదని వాజిద్ సమాధానమిచ్చారు. కమిషనర్ ఆర్‌వోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నేను అడిగింది చెప్పకుండా ఎవరో ఇవ్వలేదని ఎలా చెబుతారని దూషించారు. ఈక్రమంలో వాజిద్ సహనం కోల్పోయి ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ సమావేశం నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సహచర ఉద్యోగులు వారించారు. ఇంతలో కమిషనర్ కలగజేసుకుని పనిచేయాలని చెబితే కోపం ఎందుకు అన్నారు. ఇదంతా జరుగుతుండగా ఆర్‌వో మరోమారు పైకిలేచి కేవలం నన్నే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడితే షోకాజు నోటీసు జారీచేస్తానని కమిషనర్ హెచ్చరించారు. షోకాజు నోటీసు ఎందుకు సస్పెండ్ చేయాలని చెప్పడంతో సరే.. సస్పెండ్ చేస్తానని కమిషనర్ చెప్పారు. మీరు సస్పెండ్ చేస్తే మా ఇంటిల్లిపాదితో వచ్చి నగరపాలక కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని బయటికి వెళ్లిపోయారు. ఈమేరకు వాజిద్ తన కుటుంబాన్ని తీసుకుని నగరపాలక కార్యాలయానికి పెట్రోల్ బాటిల్‌తో వచ్చారు. అనంతరం నగరపాలక కార్యాలయంలో అడిషనల్ కమిషనర్, మేయర్‌తో కలిసి ఈవిషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈక్రమంలో కొందరు ఉద్యోగులు తాము ఉద్యోగులమా.. లేక బానిసలమా అంటూ నినాదాలు చేశారు. కమిష నర్ కావాలనే రెవెన్యూ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.