Share News

దేవుని మాన్యంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:22 AM

ప్రభుత్వ, దేవదాయశాఖ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

దేవుని మాన్యంలో  కమర్షియల్‌ కాంప్లెక్స్‌
దేవుని మాన్యంలో కమర్శియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం

లక్ష్మీ జగన్నాథస్వామి భూమిలో అక్రమ నిర్మాణాలు

మొద్దునిద్రలో దేవదాయశాఖ అధికారులు

కల్లూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, దేవదాయశాఖ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు కనపడితే చాలు ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ర్టేషన్లతో వెంచర్లు వేసి పేద, మధ్యతరగతి ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఏకంగా ప్రభుత్వ, దేవుని ఆస్తులకు శఠగోపం పెడుతున్నారు.

లక్ష్మీ జగన్నాథ స్వామి మాన్యంలో..

కల్లూరు మండలం దూపాడు లక్ష్మీజగన్నాథస్వామికి సర్వే నెంబరు 60లో 6.65 ఎకరాల భూమి ఉంది. అందులో 42 సెంట్లు జాతీయ రహదారి విస్తరణలో పోయింది. అనంతరం రెవిన్యూ అధికా రులు దేవుని మాన్యం సబ్‌ డివిజన్‌ చేసి సర్వే నెంబరు 60-1లో ఖాతా సెంబరు 426లో 6.23 ఎకరాలు దేవస్థానం పేరున, సర్వే నెంబరు 60-2లో 42 సెంట్లు జాతీయ రహదారి పేరిట ఆన్‌లైన్‌ చేశారు.

ఏమార్చి మాన్యం భూమి రిజిస్ర్టేషన్‌

ప్రభుత్వ, వక్ఫ్‌, దేవని మాన్యం భూముల్లో ఎలాంటి రిజిస్ర్టేషన్లు చేయరాదు. కుట్ర పూరితంగా కొందరు 2022లో కల్లూరు రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సర్వే నెంబరు మార్చి (60-3)అక్రమంగా డాక్యుమెంట్‌ నెం:10213-2022న రిజిస్ర్టేషన్‌ చేయించుకన్నారు. సమాచారం తెలుసుకున్న దేవదాయశాఖ అధికారులు జాతీయ రహదారి పక్కన అక్రమంగా చేస్తున్న నిర్మాణాలను నిలిపివేశారు. దేవుని మాన్యం భూమిగా నిర్ధారించుకుని స్వాధీనం చేసుకున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా కమర్షియల్‌ కాంప్లెక్స్‌..

ఆక్రమణకు గురైన లక్ష్మీజగన్నాథస్వామి భూములను కాపాడ టంలో దేవదాయశాఖ అధికారులు వైఫల్యం చెందారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలంలో గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమణదారులు కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కడుతున్నా మొద్దునిద్రలో జోగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక తరలించి బహిరంగంగా నిర్మాణం చేస్తున్నా అధికా రులు పట్టించుకున్న పాపానపోలేదు. ఆక్రమణదారులతో బేరం కుదుర్చు కుని ఆ దిశగా తొంగి చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దేవుని మాన్యం భూమిని కాపాడాలని కోరుతున్నారు.

ఆక్రమ నిర్మాణలు చేపడితే చర్యలు

గతంలో దేవుని మాన్యం భూముల్లో ఆక్రమణలు నిలిపి, స్వాధీన చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈఓ దినేష్‌ను పరిశీలనకు పంపి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంటా. అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టపరమైన చర్యలుంటాయి. -సుధాకర్‌రెడ్డి. దేవదాయశాఖ సహాయ కమిషనర్‌

Updated Date - Nov 26 , 2025 | 12:22 AM