Share News

దైవ దర్శనానికి వచ్చి వెళ్తూ...

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:22 PM

ఆరుగురు యువకులు మంచి స్నేహితులు. కర్ణాటక రాష్ట్రం దార్వాడ జిల్లా హుబ్లీ దగ్గర ఓ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు.

 దైవ దర్శనానికి వచ్చి వెళ్తూ...

ఎల్లెల్సీలోకి దూసుకెళ్లిన కారు

ఇద్దరు యువకులు గల్లంతు

ఒకరి మృతదేహం లభ్యం

గల్లంతైన యువకుడి కోసం గాలింపు

మరో నలుగురిని కాపాడిన రైతు కూలీలు

అతివేగమే కారణమంటున్న స్థానికులు

ఆరుగురు యువకులు మంచి స్నేహితులు. కర్ణాటక రాష్ట్రం దార్వాడ జిల్లా హుబ్లీ దగ్గర ఓ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవుకావడంతో రాఘవేంద్రస్వామి దర్శించుకునేందుకు కారులో వచ్చారు. స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కొప్పల్‌ దగ్గర ఉన్న గవిమఠాన్ని సందర్శించుకోవాలని అనుకున్నారు. వారు వెళ్తున్న కారు అతివేగంగా కౌతాళం సమీపంలో ఎల్లెల్సీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. కాగా వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో నలుగురు యువకులను కాలువగట్టుపై భోజనాలు చేస్తున్న రైతు కూలీలు సురక్షితంగా కాపాడారు. కాగా ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కౌతాళం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చి వెళ్తూ ఓ కారు అతివేగంతో ఎల్లెల్సీలోకి దూసుకెళ్లింది. ఈ ఘట నలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కారులో ఉన్న మిగతా నలుగురిని రైతు కూలీలు సురక్షితంగా కాపాడినట్లు కౌతాళం సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. వివ రాలు.. కర్ణాటక రాష్ట్రం దార్వాడ జిల్లా హుబ్లీలోని ఓ కంపెనీలో సునీల్‌, మణికంఠ, హైదర్‌, మంజునాథ్‌, అప్పయ్య, అభిషేక్‌ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరంతా 25ఏళ్లలోపు యువకులే. మంచి స్నేహితులు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో మంత్రాలయానికి రాఘవేంద్రస్వామిని దర్శనార్థం కారులో వచ్చారు. దర్శనం ముగించుకొని ఆదివారం మధ్యా హ్నం స్వగ్రామానికి బయలుదేరారు. కొప్పల దగ్గర ఉన్న గవిమఠం క్షేత్రా న్ని దర్శించుకొని అక ్కడి నుంచి హుబ్లీకి రాత్రికంతా చేరుకోవాలనుకు న్నారు. అతివేగంతో కారు కౌతాళానికి సమీపంలోని ఎల్లెల్సీ కాలువలోకి దూసుకెళ్లింది. మణికంఠ(20), సునీల్‌ (21) కాలువ నీటిలో గల్లంత య్యారు. సునీల్‌ మృతదేహం లభ్యమైంది. మణికంఠ ఆచూకీ కోసం చీకటి పడినా ఎస్టీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ టీం, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగించారు. తహసీల్దార్‌ రజనీకాంత్‌రెడ్డి, మంత్రాలయం సీఐ రామాంజులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

కాలువ గట్టుపై భోజనాలు చేస్తున్న..

కౌతాళం మండల టీడీపీ నాయకుడు వెంకటపతిరాజు పొలంలో పను ల కోసం వచ్చిన ఎరిగేరి, లక్ష్మీనగర్‌ క్యాంపులకు చెందిన రైతు కూలీలు గొట్టయ్య, గోవర్థన్‌, రమేష్‌ ఆదివారం మధ్యాహ్నం 2.30గంటల సమ యంలో ఎల్లెల్సీ కాలువ గట్టుపై భోజనాలు చేస్తున్నారు. ఆసమయంలో కుప్పగల్‌ నుంచి కౌతాళం వైపు వేగంగా వెళ్తున్న కారు కాలువలోకి దూ సుకెళ్లింది. గట్టుపై భోజనం చేస్తున్న కూలీలు క్షణాల్లో అప్రమత్తమ య్యారు. కాలువలో పడిన కారులోని యువకులను కాపాడేందుకు ముం దుకు వచ్చారు. హైదర్‌, మంజునాథ్‌, అప్పయ్య, అభిషేక్‌ను సురక్షితంగా కాపాడారు. వీరిలో ఇద్దరికి ఈత వస్తుండడంతో కారులో నుంచి అతి కష్టంమీద బయటకు వస్తుండగా కూలీలు వారిని ఒడ్డున చేర్చి ప్రాణా లను కాపాడారు. అప్పటికే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిని కాపాడలేకపోయామనే బాధ వేధిస్తుందని కూలీలు పేర్కొన్నారు.

ఎక్స్‌కవేటర్‌ సహాయంతో..

ఎల్లెల్సీలోకి కారు దూసుకుపోయిందనే సమాచారం తెలియగానే సీఐ అశోక్‌కుమార్‌, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కూలీ లు నలుగురు యువకులను కాపాడారు. ఎక్స్‌కవేటర్‌ సహాయంతో కాలు వలోని కారును బయటకు తీశారు. సునీల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మిత్రులను కోల్పోవడం ఎంతో బాధగా ఉందని, ఆ రాఘవేంద్రస్వాయే మమ్మల్ని కాపాడారని, ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడిన యువకులు పేర్కొన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jul 20 , 2025 | 11:22 PM