Share News

పారిశుధ్య పనులపై కలెక్టర్‌ అసంతృప్తి

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:34 PM

కర్నూలు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అసంతృప్తి వ్యక్తంచేశారు.

పారిశుధ్య పనులపై కలెక్టర్‌ అసంతృప్తి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోండి

డివైడర్లకు పెయింటింగ్‌ వేయండి

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలపై ఈఈలు, డీఈలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, మేనేజర్‌, ఏఈలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.నగరంలోని బి.క్యాంపు నుంచి రాజ్‌విహార్‌ వరకు రోడ్లు పరిశుభ్రతపై సక్రమంగా విధులు నిర్వహించని ప్రజా ఆరోగ్య అధికారికి షోకాజ్‌ నోటీసులు, సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1200 మంది శానిటరీ వర్కర్లు ఉన్నప్పటికీ నగరాన్ని శుభ్రంగా ఉంచకపోతే ఎలా అని ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాలు సక్రమంగా జరగాలని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనరు, గూడూరు మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. కర్నూలు నగర సుందరీకరణలో భాగంగా బి.క్యాంపు నుంచి బస్టాండు వరకు ఉన్న డీవైడర్లకు ఆకర్షణీయంగా పెయింటింగ్‌ వేయించాలని కమిషనర్‌ను ఆదేశించారు. కల్లూరులో ఉన్న 16 వార్డులకు ప్రతిరోజూ నీరు ఇచ్చేందుకు కమిటీ వేశామన్నారు. టిడ్కో గృహాలక సంబంధించి గృహాలు కేటాయింపు చేసిన వారికి హౌస్‌నెంబర్లు ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌తో మాట్లాడి రేషన్‌షాపు ఏర్పాటు చేయించాలన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపల్‌ కమిషనర్లు విశ్వనాథ్‌, కృష్ణ, గంగిరెడ్డి, రమేష్‌బాబు, నగరపాలక సంస్థ హెల్త్‌ ఆఫీసర్‌ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:34 PM