వినియోగదారులపై బండ
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:58 AM
గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ మీద అదనంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ వినియోగం కోసం వినియోగించి గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో సిలిండర్లను సరఫరా చేస్తోంది.

గ్యాస్ సిలిండర్ డెలివరీకి అదనపు వసూళ్లు
రసీదు రూ.908లు, వసూలు చేసేది రూ.970, గ్రామాల్లో రూ.1,000
పత్తికొండ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ మీద అదనంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ వినియోగం కోసం వినియోగించి గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో సిలిండర్లను సరఫరా చేస్తోంది. పత్తికొండ పరిధిలో 16,493 మంది గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 14,950 మంది వినియోగదారులు యాక్టివ్‌మోడ్‌లో ఉన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఆటోల ద్వారా పట్టణంతోపాటు గ్రామీణప్రాంతాలకు సిలిండర్లను సరఫరా చేస్తుంటారు.
డెలివరీ చార్జీల పేరుతో..
నిర్వాహకులు మాత్రం డెలివరీ ఛార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు ఇంటివద్దకు సిలిండర్ ఇచ్చినందుకు ఒక్కో సిలిండర్‌పై రూ.70 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో రూ.20ల నుంచి రూ. 30 వరకు వసూలు చేస్తుండగా, అది ప్రస్తుతం రూ.70 వరకు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ పట్టణంలో సిలిండర్ ధర రూ.908 కాగా రూ.970 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఏకంగా రూ.1,000 తీసుకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ దందా విషయం అధికారు లకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
రూ 970లు తీసుకున్నారు
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా డెలివరీకి రూ.970 లు తీసుకున్నారు. రసీదులో రూ.908లు మాత్రమే ఉంది. అదేమని అడిగితే డీజిల్ రేట్లుపెరిగాయి, డెలివరీ ఛార్జీలను కూడా పెంచామంటున్నారు. - ఖాసిం, పత్తికొండ
ఫిర్యాదు చేస్తే చర్యలు
గ్యాస్ వినియోగదారుల నుంచి డెలివరీ చార్జీలు వసూలు చేయరాదు. అలా వసూలు చేసినట్లు గ్యాస్ వినియోగదారులు లిఖితపూ ర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - హుసేన్ సాహెబ్, తహసీల్దార్, పత్తికొండ