హామీలు తప్పుతున్న సీఎం
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:37 PM
ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను తప్పుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
ప్రజా సమస్యలను పక్కన పెట్టి పదవుల కోసం కుమ్ములాట
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఆలూరు, జూలై11(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను తప్పుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం ఆలూరు పట్టణంలో పార్టీ 12వ మహాసభ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పాత బస్టాండు వద్ద నిర్వహించిన బహిరంగ సమావేశం ఆలూరు మండల కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి పేరిట ప్రభుత్వం కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్నదన్నారు. ఎన్నికల ముందు రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానని హామీ ఇచ్చి నేడు జాప్యం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను, ఆలూరు ప్రాంతంలో వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధి మరిచి కుమ్ములాటలతోనే కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి గిడ్డయ్య, జిల్లా నాయకులు భూపేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, జిల్లా కార్యదర్శి నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు.