Share News

అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:46 AM

మండలంలోని గోరంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-4ను కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణులు, పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు రికార్డులను పరిశీలించారు.

అంగన్‌వాడీ  కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌
గుడ్ల స్టాకును పరిశీలిస్తున్న కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, చిత్రంలో పీడీ విజయ

నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆగ్రహం

కార్యకర్త తొలగింపు.. సూపర్‌వైజర్‌కు షోకాజ్‌

కోడుమూరు రూరల్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోరంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-4ను కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణులు, పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు రికార్డులను పరిశీలించారు. స్టాకు, రికార్డుల్లో చూపిన సంఖ్యకు పొంతన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 1,309 గుడ్లు స్టాకు చూపగా, 1,584 గుడ్లు ఉన్నట్లు గుర్తించి ఎందుకు పంపిణీ చేయలేదని కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నా, వందశాతం హాజరు నమోదు చేసినట్లు, ప్రీ స్కూల్‌ కిట్లు వినియోగించకవడాన్ని గమనించారు. పిల్లలు ఆంగ్ల అక్షరాలు కూడా చెప్పలేకపోతున్నారని, ఏమి నేర్పుతున్నారని ప్రశ్నించారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు నమోదు రిజిస్టర్‌ నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం అపరిశుభ్రంగా ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అంగన్వాడీ కార్యకర్త ఫాతిమాను విధులు నుంచి తొలగించాలని, సూపర్‌వైజర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఐసీడీఎస్‌ పీడీ విజయను ఆదేశించారు. తహసీల్దార్‌, ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు అంగన్వాడీ, పాఠశాల, వైద్యశాలలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌ పీడీ విజయ, తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో రాముడు, సీడీపీవో వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:46 AM