తరగతుల విలీనాన్ని ఆపాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 01:03 AM
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 3 నుంచి 8 తరగతుల వరకు విద్యార్థులను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడాన్ని విరమించుకోవాలని పీడీఎస్‌యూ, బీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకుల ధర్నా
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 3 నుంచి 8 తరగతుల వరకు విద్యార్థులను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడాన్ని విరమించుకోవాలని పీడీఎస్‌యూ, బీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలియజేశారు. విద్యార్థులు మా స్కూల్ మాకే కావాలి... తరగతుల విలీనాన్ని ఆపండంటూ నినాదాలు చేశారు. తరగతులను విద్యార్థులకు అదే పాఠశాలలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల వద్దకు డీఈవో శామ్యూల్‌పాల్ వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఈ సమస్యపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం పౖ విద్యార్థిసంఘాల నాయకులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐడీఎస్‌వో కార్యదర్శి మల్లేష్, పీడీఎస్‌యూ అస్లాం, జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్, బీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు దత్తు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.