ఈతకెళ్లి ఇద్దరు బాలికలు మృతి
ABN , Publish Date - May 24 , 2025 | 12:22 AM
ఈతకెళ్లి ఇద్దరు బాలికలు మృతిచెందారు. ఈ ఘటన గోనెగండ్లలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బోయ మందకల్లు, బోయ సరస్వతికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమార్తె బోయ మాధురి(12) ఆరో తరగతితో చదువు మానేసింది.
మిన్నంటిన తల్లిదండ్రుల రోదనల
గోనెగండ్లలో విషాదం
గోనెగండ్ల, మే 23(ఆంధ్రజ్యోతి): ఈతకెళ్లి ఇద్దరు బాలికలు మృతిచెందారు. ఈ ఘటన గోనెగండ్లలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బోయ మందకల్లు, బోయ సరస్వతికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమార్తె బోయ మాధురి(12) ఆరో తరగతితో చదువు మానేసింది. అదే వీధి సమీపంలో బోయ రంగప్పనాయుడు, బోయ మహేశ్వరి లకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు కూడా కూలీ పనులు చేసి జీవనం సాగించేవారు. వీరి రెండో కుమార్తె బోయ మంజుల(12) కూడా పొలం పనులకు వెళ్లేది. అయితే శుక్రవారం ఇద్దరు బాలికల తల్లులు సరస్వతి, మహేశ్వరి గ్రామానికి చెందిన కురువ నాగరాజు పొలంలో కూలీ పనులకు వెళ్లారు. బాలికలు కూడా తమ తల్లులతో పాటు పొలంకు వెళ్లారు. పత్తి విత్తనాలు విత్తే పనులు మధ్యాహ్నం ఒంటి గంట లోపు పూర్తయ్యాయి. అయితే పిల్లలద్దరు తమ తల్లులకు చెప్పకుండా నాగరాజు పొలంలో ఉన్న నీటి తొట్టిలో ఈతకెళ్లారు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి పోయారు. ఇద్దరికి ఈత రాక పోవడంతో నీటిలో పూర్తిగా మునిగి పోయారు. వారి అరుపులు కూడా పొలంలోని వారికి వినిపించలేదు. నీటిలో ఊపిరాడక మృతి చెందారు.
ఎంత సేపటికి తమ పిల్లలు కనిపించక పోవడంతో సరస్వతి, మహేశ్వరి పొలంలో వెతికారు జాడ కనిపించ లేదు. నీటి తొట్టి వైపు వెళ్లి చూడగా అక్కడ మాధురి, మంజుల ఇద్దరు శవాలై నీటి తొట్టిలో కనిపిం చారు. తల్లులు రోదనలతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే వారు అక్కడికి చేరుకొని నీటి తొట్టి నుంచి బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు మృతిచెందారు. తల్లిదండ్రులు, బంధు వులు, స్నేహితులు రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.