చెక్ దోపిడీ
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:33 PM
ఇష్టానుసారంగా వెలిసిన చెక్‌పోస్టులు దోపిడీ పర్వానికి తెర లేపాయి. కప్పట్రాళ్ల, ఈదులదేవరబండ గ్రామాల ప్రధాన రహదారులపై ప్రైవేట్ చెక్‌పోస్టులు వెలిశాయి.
ఇష్టానుసారంగా ప్రైవేటు చెక్‌పోస్టులు ఏర్పాటు
వాహనాల నుంచి భారీగా పన్నులు వసూలు
ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు
దేవనకొండ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఇష్టానుసారంగా వెలిసిన చెక్‌పోస్టులు దోపిడీ పర్వానికి తెర లేపాయి. కప్పట్రాళ్ల, ఈదులదేవరబండ గ్రామాల ప్రధాన రహదారులపై ప్రైవేట్ చెక్‌పోస్టులు వెలిశాయి. మైనింగ్ శాఖకు టెండర్లుకు పిలవడంతో సుధాకర ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ టెండర్ దక్కించుకొని చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు అక్కడి సిబ్బంది తెలుపుతున్నారు. కర్నూలు-బళ్లారి రహదారిపై కంకర, గ్రానైట్ బండలు, ఎర్రమట్టి తీసుకెళ్లే వాహనాల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్నరు. కొత్తగా ఏర్పాటైన చెక్‌పోస్టు డబ్బాలపై ఎలాంటి అనుమతులు, విధివిదానాలు లేకపోవడంతో అనుమానాలకు తావిచ్చేలా ఉందని పలువురు వాపోతున్నారు. మండలంలోని ఓగ్రామంలో రోడ్డుపై గుంతులు పడటంతో ట్రాక్టరు ద్వారా మట్టి తరలిస్తుండగా, చెక్‌పోస్టు సిబ్బంది వచ్చి ట్రాక్టరుకు రూ.300 చెల్లించాలని మొం డికేశారు. ఇన్నాళ్లుగా లేని రుసుము ఎందుకివ్వాలని నిలదీయగా చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు దాంతో పన్ను చెల్లించి మట్టిని తీసుకెళ్లాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముందస్తు సమాచారం లేకుండా చెక్‌పోస్టుల ఏర్పాటుపై లారీ, ట్రాక్టరు వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి చెక్‌పోస్టులు లేవు
ఈవిషయంపై తహసీల్దార్ సుదర్శనంను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రందించగా తమకు సంబంధించి ఎలాంటీ చెక్‌పోస్టులు లేవన్నారు. ఈదులదేవరబండ, కప్పట్రాళ్ల వద్ద ఏర్పాటైన చెక్‌పోస్టులపై విచారణ చేపడుతామని తెలిపారు.