Share News

ఉద్యోగాలన్నారు.. మోసం చేశారు..!

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:04 AM

: ఉద్యోగాలు ఇస్తామన్నారు.. నమ్మకంగా కలిగే ప్రవర్తించారు.. తీరా మోసం చేశారు. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన వంద కోట్ల రూపాయలతో ఉడాయించారు.

ఉద్యోగాలన్నారు.. మోసం చేశారు..!
ఆర్‌అండ్‌బీ రోడ్డుపై బైఠాయించిన బాధితులు

ఒక్కొక్కరి నుంచి రూ.3.50లక్షల దాకా వసూలు

ఉడాయించిన కేటుగాళ్లు

రోడ్డెక్కిన బాధితులు

న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ

దొర్నిపాడు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు ఇస్తామన్నారు.. నమ్మకంగా కలిగే ప్రవర్తించారు.. తీరా మోసం చేశారు. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన వంద కోట్ల రూపాయలతో ఉడాయించారు. బాధితులు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఆత్మహత్య శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలతో ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. స్థానికులు తెలిపిన వివరాలు.. దొర్నిపాడుకు చెందిన బాసిరెడ్డి వీరారెడ్డి, అతడి అల్లుళ్లు రాజారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి హెల్త్‌ అండ్‌ వెల్త్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ప్రారంభించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.2.50లక్షల నుంచి రూ.3.50ల వరకు వసూలు చేశారు. మూడేళ్లు ఉద్యోగ భద్రత కల్పించి నెలకు రూ.40వేలు జీతం ఇస్తామని భరోసా ఇచ్చారు.

ఆళ్లగడ్డ, రుద్రవరం, దొర్నిపాడు, అనంతపురం జిల్లా యల్లనూరు మండలాని చెందిన దాదాపు 2,500మంది నిరుద్యోగులు డబ్బులు చెల్లించారు. వీరిని హెల్త్‌ అండ్‌వెల్త్‌ కంపెనీలో చేర్పించుకొని రూ.40వేలు జీతం కొన్నినెలలు అందజేశారు. నిరుద్యోగులు ఆ కంపెనీకి ఆకర్షితులయ్యారు. ఉద్యోగాల నానా పాట్లు పడి ఇళ్లు, బంగారు తాకట్టు డబ్బులు చెల్లించారు. కాగా ఈనెల 7వ తేదీన యల్లనూరు పోలీసుస్టేషన్‌లో రాజారెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదైంది. నెల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో వీరారెడ్డిని బాధితులు ప్రశ్నించారు. డబ్బులు ఇస్తానని బాధితులను నమ్మబలికించాడు. మంగళవారం 500మంది దాకా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని విషయంపై ఆరా తీశారు. డబ్బులు కట్టించుకున్న వారిపై కేసు నమోదుచేసి న్యాయం చేసేలా చూస్తానని అన్నారు. తమకు న్యాయం చేసే వర కు నిరసన విరమించేది లేదని బాధితులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో డీఎస్పీ ప్రమోద్‌ బాధితుల వద్దకు వచ్చి ఎవరు ఎంత డబ్బు కట్టింది తగిన రశీదులతో పోలీసుస్టేషన్‌లో అందజేస్తే వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రాజారెడ్డి, వీరారెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 15 , 2025 | 01:04 AM