చకచకా
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:11 AM
ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన నేపథ్యంలో అధికారులు బిజీగా మారారు. ఓ వైపు అధికారులు, మరో వైపు కూటమి నాయకులు ఎవరికి వారు సమీక్షలు, సమాలోచనలు చేస్తున్నారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
పదుల సంఖ్యలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు
రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్రస్థాయి బలగాలు
నేటి సాయంత్రానికి పనులు పూర్తయ్యే అవకాశం
ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన నేపథ్యంలో అధికారులు బిజీగా మారారు. ఓ వైపు అధికారులు, మరో వైపు కూటమి నాయకులు ఎవరికి వారు సమీక్షలు, సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులు కర్నూలులో మకాం వేశారు. కేంద్ర బలగాలు మూడు రోజుల నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. కర్నూలు నగరాన్ని సైతం జల్లెడ పడుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నాయకులు తమ నేతలతో సమీక్షలు, జనసమీకరణపై దృష్టి పెట్టారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం కర్నూలు, నంద్యాల కలెక్టర్లు డాక్టర్ సిరి, రాజకుమారి, డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీలు విక్రాంత్ పాటిల్, సునీల్ షెరాన్ ఉదయం నుంచే ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి పనులన్నీ పూర్తి చేసి ఆయా వేదికలు, ప్రదేశాలను ఎస్పీజీ, కేంద్ర బలగాలకు అప్పజెప్పేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ప్రధాని ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్
ఓర్వకల్లు/ కర్నూలు అర్బన్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఆదివారం మండలంలోని నన్నూరు గ్రామ సమీపంలో టోల్‌గేటు వద్ద ఉన్న రాగమయూరి సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించి జరుగుతున్న పనులు, పెండింగ్‌లో ఉన్న పనులను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనానంతరం కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు వస్తారన్నారు. సభకు హాజరు కావడంతో వర్చువల్ విధానం ద్వారా వివిద ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని ఏర్పాట్లలో అధికారులు సమన్వయంతో పని చేసి పనులను పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, టీడీపీ యువ నాయకుడు సోమిశెట్టి నవీన్, పుసులూరు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
త్వరితగతిన పూర్తి చేయండి
కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
ఓర్వకల్లు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఉమ్మడి జిల్లా పర్యటన సందర్బంగా పెండింగ్‌లో ఉన్న ఏర్పాట్లను సోమవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లా పర్యటన సందర్భంగా నన్నూరు టోల్‌గేటు వద్ద ఉన్న రాగమయూరి వద్ద సభాప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్‌తో పాటు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలిస్తూ ప్రధాని వచ్చే దారిలో పనులను పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు భరత్‌గుప్తా, మౌర్యమాన్ పటేల్, ఆదర్శ రాజేంద్రన్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, చల్లా కళ్యాణి, భావన, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయండి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
ఓర్వకల్లు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు గ్రామ సమీపాన గల టోల్‌గేటు వద్ద రాగమయూరి సభా ప్రాంగణం ఏర్పాట్లను అధికారులు, టీడీపీ నేతలతో కలసి పరిశీలించారు. ప్రధాని పర్యటనను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు, వాహన సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ జిల్లా ఇన్‌చార్జి తిక్కారెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, మంతెన సత్యనారాయణ రాజు, మీడియా కోఆర్డినేటర్ బి.వెంకటరాముడు, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, నాయకులు ఉన్నారు.