చైన్ స్నాచర్ల హల్‌చల్
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:28 AM
నగరంలో చైన్ స్నాచర్లు హల్‌చల్ చేశారు. మంగళవారం ఒక్కసారిగా రెచ్చిపో యారు. గంటన్నర వ్యవధిలోనే మూడు చోట్ల స్నాచింగ్ చేశారు.
గంటన్నర వ్యవధిలో మూడుచోట్ల చైన్ స్నాచింగ్‌లు
అప్రమత్తమైన పోలీసులు
ముమ్మర గాలింపు చర్యలు
కర్నూలు క్రైం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): నగరంలో చైన్ స్నాచర్లు హల్‌చల్ చేశారు. మంగళవారం ఒక్కసారిగా రెచ్చిపో యారు. గంటన్నర వ్యవధిలోనే మూడు చోట్ల స్నాచింగ్ చేశారు. మొదట తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో పుల్లయ్య కాలేజీ సమీపంలో అపూర్వ వెంచర్ వెనుకాల లక్ష్మీదేవి అనే ఉపాధ్యాయు రాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు అపహ రించారు. ఈమె బ్రాహ్మణకొట్కూరులో టీచర్‌గా పనిచేస్తుంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిత్యావసర సరుకుల కోసం రోడ్డుపైకి వచ్చి తిరిగి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగలు మెడలోని గొలుసును తెంపుకుని ఉడాయించారు. బాధితురాలు కేకలు వేసినా ఫలితం లేకపోయింది.
ఈ సంఘటన జరిగిన అరగంటకే త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటాద్రినగర్‌లో యశోద అనే మహిళ మెడలో నుంచి గొలుసు తెంపుకుని పరారయ్యారు. ఆమె తన ఇంటి ముందు నిల్చుని ఉండగా ఫ్యాషన్ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు చటుకున్న ఆమె మెడలోని గొలుసు తెంపుకుని ఉడాయించారు. అపహరణకు గురైన గొలుసు విలువ సుమారు మూడు తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన జరిగిన గంట సేపటి వ్యవధిలోనే నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంతోష్ నగర్‌లో భాగ్యలక్ష్మి అనే మహిళ మెడలోని నుంచి చైన్ లాగేశారు. ఈమె సంతోష్‌నగర్ లోని రోడ్డు నెంబరు 6లో మసీదు సమీపంలో తన బాడుగ ఇంటి నుంచి సొంతింటికి వెళ్తుండగా.. మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసు తెంపుకుని ఉడాయించారు. బాధితురాలు తేరుకుని కేకలు వేసేలోపే ఆ యువకులు పరారయ్యారు. నగరంలో మూడు చోట్ల స్నాచింగ్‌లు జరగడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. వెంటనే అప్రమత్తమై పలు చోట్ల గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతకుల ఆచూకి కోసం గాలిస్తున్నారు.