Share News

సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:04 AM

మెగా డీఎస్సీ ఎంపిక అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. సర్వర్‌ డౌన్‌ కారణంగా ప్రక్రియ నత్తనడకన కొనసాగింది

సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న సిబ్బంది

సర్వర్‌ మొరాయింపుతో అర్ధరాత్రి దాకా కొనసాగిన ప్రక్రియ

ఇబ్బందులు పడిన డీఎస్సీ అభ్యర్థులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ఎంపిక అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. సర్వర్‌ డౌన్‌ కారణంగా ప్రక్రియ నత్తనడకన కొనసాగింది. గురువారం మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు 1,050 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల ప్రక్రియ పూర్తయింది. కాల్‌ లెటర్స్‌ వచ్చిన అభ్యర్థుల సమస్యలను పరిష్కరించడంలో విద్యాశాఖ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీలో ఎస్‌జీటీ 1827, స్కూల్‌ అసిస్టెంట్లు (నాన్‌ లాంగ్వేజ్‌) 314, స్కూల్‌ అసిస్టెంట్లు (లాంగ్వేజ్‌) 537 పోస్టుల భర్తీకి మెరిట్‌ కం రోస్టర్‌ ప్రకారం అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. కర్నూలు నగరంలోని రాయలసీమ విశ్వవిద్యాలయం, నన్నూరు సమీపంలోని మారుతి ఎస్టేట్‌లోని శ్రీ రాఘవేంద్ర బీఈడీ కళాశాల, శ్రీనివాస బీఈడీ కళాశాలలో అభ్యర్థుల పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 54 వెరిఫికేషన్‌ కేంద్రాలను నియమించారు. ఒక్కో బృందంలో ఎంఈవో, హెచ్‌ఎంలు, డిప్యూటీ తహసీల్దార్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించారు. ఓపెన్‌ కేటగిరిలో ఇతర జిల్లాలకు చెందిన అభ్యర్థులు 336 పోస్టులు సాధించారు. ఎస్టీటీలోనే 133 మంది పోస్టులకు ఎంపికయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అభ్యర్థుల కంటే శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఓపెన్‌ కేటగిరిలో నాన్‌ కేటగిరి పోస్టులను అత్యధికంగా దక్కించుకున్నారు.

అవస్థలు పడిన అభ్యర్థులు

కొంత మంది అభ్యర్థులు కాల్‌లెటర్లు మెసేజ్‌లు రాకున్నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కేంద్రాల వద్ద చేరుకున్నారు. తమ కంటే తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చిన వారికి కాల్‌ లెటర్స్‌ ఎలా పంపి స్తారని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. అలాగే స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌లో ఒకే కేటగిరికి చెందిన అభ్యర్థికి 81వ ర్యాంకు వచ్చినా తనకు కాదని 105, 106 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు కాల్‌ లెటర్స్‌ రావడం పట్ల విద్యాశాఖ అధికారుల వద్ద తమ బాధను వెల్లబోసుకున్నారు. అలాగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం కాల్‌ లెటర్స్‌ వచ్చిన అభ్యర్థికి కటాఫ్‌ డేట్‌ తర్వాత విద్యార్హతకు సంబంధించిన యూనివర్సిటీ సర్టిఫికెట్లు జారీ చేసిన తేదీల్లో వ్యత్యాసం ఉండటంతో విద్యాశాఖ అధికారులు వెరిఫికేషన్‌కు నిరాకరించడంతో అభ్యర్థులు ఆందోళనలకు గురయ్యారు. ఎస్‌జీటీ పోస్టుకు పరీక్ష రాస్తే స్కూల్‌ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులకు కాల్‌ లెటర్స్‌ రావడం పట్ల అభ్యర్థులు అవాక్కయ్యారు. సాంకేతక కారణాలు తలెత్తడంతో మెగా డీఎస్సీ ఎంపిక సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వచ్చిన అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం జిల్లా విద్యాశాఖ అధికారుల పరిధిలో లేకపోవడంతో రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గెజిటెడ్‌ ఆఫీసర్ల సంతకం చేయించుకోకుండానే హాజరైన పలువురు అభ్యర్థులు సంతకాల కోసం అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతూ ఒత్తిడికి గురయ్యారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, హెచ్‌ఎంలతో అభ్యర్థుల సర్టిఫికెట్లకు అటెస్టేషన్‌ చేయించడంతో ఊరట చెందారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇస్మాయిల్‌, మరియా నందం, పీఆర్‌టీయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కరుణానిధిమూర్తి, జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ కృష్ణారెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి, ప్రధాన కార్యదర్శి జనార్దన్‌, ఆప్టా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్‌ కుమార్‌, జిల్లా అద్యక్షులు రవికుమార్‌తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేంద్రాల్లో అభ్యర్థుల సమస్య లను తెలుసుకుని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అర్ధరాత్రి వరకూ కొనసాగిన పరిశీలన..

మొదటి రోజు 2,307 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన అర్ధరాత్రి వరకూ కొనసాగిది. వీరే కాకుండా మరో 260 మంది అభ్యర్థులకు గురువారం రాత్రి కాల్‌లెటర్స్‌ విడుదల కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు.

పరిశీలించిన అధికారులు

ఆర్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని జేసీ నవ్య పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర పాఠశాలల విద్య ఏడీ ప్రతాప్‌ రెడ్డి, అబ్రహాం, డీఈవో శామ్యూల్‌పాల్‌ కేంద్రాలను పర్యవేక్షించారు.

Updated Date - Aug 29 , 2025 | 12:04 AM