Share News

అధికారులపై కేంద్ర బృందం అసహనం

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:09 AM

ఉయ్యాలవాడ మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై కేంద్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనులను మంగళవారం టీమ్‌ లీడర్‌ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేంద్ర బృందం పరిశీలించింది.

అధికారులపై కేంద్ర బృందం అసహనం
గోవిందపల్లెలో గోకులం షెడ్డును పరిశీలిస్తున్న అధికారులు

రికార్డుల నిర్వహణ సరిగా లేదని ఆగ్రహంట

ఉయ్యాలవాడ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఉయ్యాలవాడ మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై కేంద్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనులను మంగళవారం టీమ్‌ లీడర్‌ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేంద్ర బృందం పరిశీలించింది. ఈ మేరకు గోవిందపల్లె, ఆర్‌.జంబులదిన్నె గ్రామాల్లో అధికారులు పర్యటించారు. గోవిందపల్లె గ్రామంలో పర్యటించి 2022-25 సంవత్సరాల్లో ఉపాధి హామీలో జరిగిన పనులు, వాటి ఫైళ్లు, ఎంబుక్‌లను తనిఖీ చేశారు. గ్రామంలోని ఓ రైతు నిర్మించుకున్న గోకులం షెడ్డుకు సంబంధించిన రూ.50 వేల మెటీరియల్‌కు బిల్లు చూపాలని స్థానిక అధికారులను అడిగారు. దీంతో ఆ రికార్డులు తమ వద్ద లేవని కార్యాలయంలో ఉన్నాయంటూ వారు బుకాయించారు. దీంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్‌.జంబులదిన్నె గ్రామంలో గ్రామైక్య సంఘ మహిళలతో మాట్లాడుతూ తమ విధులను వివరించాలని అడిగారు. దీంతో వారి నుంచి సరైన సమాధానం రాలేదు. గ్రామైక్య సంఘ సభ్యులకు శిక్షణ ఇచ్చారా? లేదా? అని అఽధికారులను ప్రశ్నించారు. పొదపు రుణాలపై ఆరా తీశారు.

వీవో రికార్డులు చూపని వెలుగు సిబ్బంది

కేంద్ర బృందం వారు అడిగిన వీవో రికార్డులను వెలుగు సిబ్బంది, అధికారులు చూపలేక పోయారు. గతంలో పని చేసిన వీవోఏను ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో తొలగించామని, తొలగించిన వీవోఏ రికార్డులను తమకు అప్పగించలేదన్నారు. కొత్తగా వచ్చిన వీవో మినిట్స్‌, క్యాష్‌ బుక్‌ చూపించాలన్నారు. అందులో కేవలం రెండు మీటింగ్స్‌ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. క్యాష్‌ బుక్‌కు బదులుగా 2011 బ్యాంక్‌ స్టేట్‌ మెంట్‌ చూపారు. 2011 నుంచి ఇప్పటి వరకు వీవో లావాదేవీలే జరగలేదా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు వీవోఏలకు జీతాలు ఏవిధంగా ఇస్తున్నారన్నారు. దీంతో సమాధానం చెప్పలేకపో యిన మండల అధికారులు నీళ్లు నమిలారు.

ఎమ్మెల్యే చెబితే నలుగురిని తొలగించాం

ఎమ్మెల్యే చెబితే మండలంలోని నలుగురు వీవోఏలను తొలగించామని వెలుగు ఏపీఎం దాసన్న కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్‌.జంబులదిన్నె, ఆర్‌.పాంపల్లె, తుడుమలదిన్నె, పెద్దయమ్మనూరు వీవోఏలను ఏప్రిల్‌ నెలలో తెలగించి కొత్త వారిని నియమించామన్నారు. రికార్డులు తమకు అప్పగించటం లేదని కేంద్ర బృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం డీఆర్డీఏ పీడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. సభ్యులు సూర్యకంటప్రధాన్‌, డ్వామా పీడీ సూర్యనారాయణ, ఏపీడీ సాంబశివరావు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, పీఆర్‌ ఏఈ వెంకటయ్య, ఆర్‌డబ్యూఎస్‌ ఏఈ ప్రణీత్‌కృష్ణ, ఏపీవోలు హరికృష్ణ, రవిప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:09 AM