Share News

సీసీఐ రికార్డు బ్రేక్‌

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:38 PM

సీసీఐ తన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పత్తి కొనుగోళ్లను పెద్ద మొత్తంలో చేపట్టింది.

సీసీఐ రికార్డు బ్రేక్‌
పెంచికలపాడులో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్న సీసీఐ

మొదటిసారి రైతుల నుంచి భారీగా పత్తి కొనుగోలు

19,902 మంది రైతుల నుంచి రూ.6లక్షల క్వింటాళ్లు

రైతుల ఖాతాలకు రూ.473 కోట్లు

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీసీఐ తన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పత్తి కొనుగోళ్లను పెద్ద మొత్తంలో చేపట్టింది. కలెక్టర్‌ డా.సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ఎప్పటికప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ నిబంధనల మేరకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయించడంలో ప్రత్యేక దృష్టిని సారించారు. ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా మార్కెట్‌ కమిటీల సెక్రటరీలు, వారి సిబ్బంది మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రతిరోజు కొనుగోలు కేంద్రాల వద్ద పర్యవేక్షించడం వల్ల ఈసారి పెద్ద మొత్తంలో రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటి దాకా 19,902 మంది రైతుల నుంచి 6,494 క్వింటాళ్ల పత్తిని సీసీఐ సంస్థ అధికారులు కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్‌ శాఖ ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు. ఈ రైతులకు రూ.473.75 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని, త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని అన్నారు. గత సంవత్సరం కర్నూలు జిల్లాలో కేవలం 11 కొనుగోలు కేంద్రాలనే సీసీఐ సంస్థ ఏర్పాటు చేసిందని కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల పత్తి కొనుగోళ్లు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయని ఏడీఎం తెలిపారు. ఆదోనిలోని ఎన్‌డీబీఎల్‌ జిన్నింగ్‌ ఫ్యాక్టరీ, బతిని జిన్నింగ్‌ మిల్లు, ఐశ్వర్య జిన్నింగ్‌ మిల్లు, విఘ్నేశ్వరి జిన్నింగ్‌ మిల్లు, శ్రీలక్ష్మి, చెన్నకేశవ జిన్నింగ్‌ మిల్లు, శ్రీభవాని జిన్నింగ్‌ మిల్లు, జయంత్‌ జిన్నింగ్‌ మిల్లు, శ్రీశ్రీ రామా జిన్నింగ్‌ మిల్లు, ధరణిశ్రీ జిన్నింగ్‌ ప్యాక్టరీలో రైతుల నుంచి సీసీఐ అధికారులు పత్తి కొంటున్నారని ఏడీఎం తెలిపారు. అదే విధంగా ఎమ్మిగనూరు మార్కెట్‌ కమిటీ పరిధిలో శ్రీమహాలక్ష్మి కాటన్‌ ట్రేడర్స్‌, శ్రీమురళి జిన్నింగ్‌ మిల్లు, మాధవ కాటన్స్‌ జిన్నింగ్‌ మిల్లు, శ్రీశివ జిన్నింగ్‌, ప్రెషింగ్‌ మిల్లులో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. కోడుమూరు మార్కెట్‌ పరిధిలో మంజిత్‌ కాటన్‌ మిల్లు, మంత్రాలయం మార్కెట్‌ కమిటీ పరిధిలో శ్రీరాఘవేంద్ర ఆగ్రో ఇండస్ర్టీస్‌ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోళ్లను సీసీఐ సంస్థ అధికారులు చేపట్టారని తెలిపారు. జనవరిలో కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు జరుగుతాయని, ఈ సంవత్సరం పత్తి కొనుగోళ్లు రూ.500 కోట్లకు పైగానే చేరే అవకాశం ఉందన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:38 PM