ఇష్టారాజ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:11 AM
పట్టణంలోని కాలనీల్లో సీసీ రహదారుల నిర్మాణంలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి అవసరం లేకున్నా ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నివాసాలు లేనిచోట్ల సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం
ప్రజలు ఉండే కాలనీలకు మొండిచేయి
పత్తికొండలో అధికారుల వింత వైఖరి
పత్తికొండ, జూన్ 24(ఆంధ్రజ్యోతి): గృహాలు ఉండి ప్రజలు నివసించే ప్రాంతాల్లో రోడ్డు వేయకుండా, ఎవరికీ ఉపయోగం లేని ప్రాంతాల్లో రూ.లక్షలు ఖర్చుచేసి సీసీ రహదారులను నిర్మిస్తు న్నట్లు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా సుమారు 30వేలపైగా జనాభా నివసిస్తున్నారు. నియోజకవర్గ, డివిజన్ కేంద్రంగా ఉన్నా చాలా కాలనీలు ఇప్పటికీ సీసీ రహదారులు, మురుగు కాలువలకు నోచుకోలేదు.
సీసీ రోడ్డులేని కాలనీలు..
ఆదోని రహదారిలోని ఆదినారాయణరెడ్డి నగర్ కాలనీ ఏర్పాటై 18సంవత్సరాలు అయింది. కాలనీలో రోజువారీ కూలీలే నివసిస్తున్నారు. కాలనీలో సీసీ రహదారి, డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నారు. రహదారిపై గుంతలు ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, వర్షం వస్తే మురుగు, వర్షపు నీరు కలిసి దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము మురుగునీటి మధ్యనే నివసించాల్సి వస్తోందని వాపోతున్నారు. అలాగే కుమ్మరిగేరి నుంచి బైపాస్ వరకు ఉన్న ప్రదాన రహదారి కూడా ఇలాగే ఉంది. ఈ రహదారిపై నిత్యం వాహనాలు వెళుతుంటాయి. తమ కాలనీలో సీసీ రహదారి నిర్మించాలని అధికా రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అలాగే దిద్దిచేను కాలనీతోపాటు శివారుకాలనీల్లో ఎక్కడ చూసినా సీసీ రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉపయోగం లేని చోట సీసీ రహదారులు
ప్రజాప్రతినిధులు, అధికారుల బంధవులు ఉండే చోట పెద్దగా అవసరం లేకున్నా సీసీ రహదా రులను ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌కో కార్యాలయం వెనుక గత నివాసాలు అంతంత మాత్రమే, జనసంచారం కూడా ఉండదు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల బంధువులు ఇంటిని నిర్మించుకోవడంతో, అక్కడ ఏమాత్రం అవసరం లేకపోయినా ఖాళీ ప్రాంతాల్లో సైతం సీసీ రహదారులు నిర్మించారు. పాతపేటలో ఓ వైసీసీ నాయకుడు తన ఇంటికి సమీపంలోనే సీసీ రహదారులను ఏర్పాటు చేయించి ప్రజాధనాన్ని వృథా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మరి కొన్నిచోట్ల అధికారులు ఏకంగా అప్పటికే ఉన్న రోడ్డుపై మరో రోడ్డు వేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి అవసరమైన చోట్ల రహదారులు, మరుగుకాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదు
2007 నుంచి నివసిస్తున్నాం. మొదట్లో గుడిసెలు వేసుకున్నాం, అనంతరం ప్రభుత్వ సహకా రంతో పక్కా ఇళ్లను కట్టుకున్నాం. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలని అధికారులకు ఎన్నో సార్లు వినతిపత్రాలు ఇచ్చాం. ఎవరూ పట్టించు కోలేదు. కాలువలు లేకపోవడంతో దుర్గంధం మధ్యే జీవిస్తున్నాం. - నజీర్, ఆదినారాయణరెడ్డి కాలనీ