Share News

అన్యమత స్టిక్కర్లతో శ్రీశైలంలోకి కారు

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:47 PM

అన్యమత స్టిక్కర్లతో శనివారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలోకి కారు ప్రవేశించడం కలకలం రేపింది.

అన్యమత స్టిక్కర్లతో శ్రీశైలంలోకి కారు
అన్యమత స్టిక్కర్లు కనిపించకుండా లేబుల్స్‌ వేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది

భద్రతా వైఫల్యమే కారణం

హిందూ సంఘాల ఆగ్రహం

శ్రీశైలం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అన్యమత స్టిక్కర్లతో శనివారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలోకి కారు ప్రవేశించడం కలకలం రేపింది. శివసదనం ఐవోసీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఉన్న కారును అటుగా వెళ్తున్న వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు గమనించి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది కారును తనిఖీ చేయగా కారుపై అన్యమతానికి చెందిన క్యాప్షన్లు, ఫొటో స్టిక్కర్లు, సైడ్‌ మిర్రర్లు, నెంబరు ప్లేటుపై మిషన్‌ తాలుకా పేరు, డ్యాష్‌బోర్డుపై గ్రంఽథం, డిక్కీలో కరపత్రాలు ఉన్నట్లు ఆలయ భద్రత అధికారి దృష్టికి తీసుకెళ్లామని హిందూ సంఘాల నాయకులు చెప్పారు. అయితే కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న ఆలయ భద్రత అధికారి కారు డ్రైవరును నామమాత్రంగా విచారించి స్థానిక పోలీసులకు అప్పగించకుండా వదిలివేశారని వారు ఆరోపించారు. కారు నిండా క్యాప్షన్లు, ఫొటోలతో ఉన్న కారు టోల్‌గేటు దాటి క్షేత్రంలోకి ప్రవేశించడం భద్రతా సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విశ్వహిందూ పరిషత్‌ శ్రీశైలం మండల అధ్యక్షుడు నారాయణ అన్నారు. కొందరు అయ్యప్ప స్వాములు తెలిసిన వారి కారును తీసుకుని వచ్చారని, వారికి తెలియక క్షేత్ర దర్శనానికి వచ్చినట్లుగా సీఎస్‌వో పొంతన లేని సమాధానం చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కారులో వచ్చిన స్వాములను కనీసం చూడకపోగా, మరో మతానికి చెందిన కారు డ్రైవరును పూర్తిస్థాయిలో విచారించకుండా విడిచిపెట్టారని, అలాగే కారును ఇక్కడి నుంచి పంపించేశారని వారు చెప్పారు. ఈ ఘటనపై సీఎస్‌వోను విచారించాలని ఈవోను కోరారు.

ప్రచారానికి రాలేదు : ఈవో శ్రీనివాసరావు

అన్యమత పోస్టర్లతో ఉన్న కారులో అయ్యప్పస్వాములు వచ్చినట్లు ఆలయ భద్రతా అధికారి తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయిలో విచారించాలని పోలీసులకు చెప్పాం. క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం వంటివి నిషేధం. అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

విచారించి కేసు నమోదు చేస్తాం : సీఐ ప్రసాదరావు

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తాం. ప్రకారం ఆలయ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై దేవదాయ ధర్మదాయ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాం.

Updated Date - Nov 23 , 2025 | 11:47 PM