కారు బోల్తా.. ముగ్గురి దుర్మరణం
ABN , Publish Date - May 20 , 2025 | 12:34 AM
దైవదర్శనానికి వెళ్తు వస్తుండగా కారు బోల్తాపడి ముగ్గురు దుర్మరణం పాలైన సంఘటన సోమవారం ప్యాపిలి మండలంలో చోటు చేసుకుంది.
మరో ముగ్గురికి గాయాలు
మృతులు కర్ణాటక వాసులు
శ్రీశైలానికి వెళ్లి వస్తుండగా ఘటన
ప్యాపిలి, మే 19 (ఆంధ్రజ్యోతి): దైవదర్శనానికి వెళ్తు వస్తుండగా కారు బోల్తాపడి ముగ్గురు దుర్మరణం పాలైన సంఘటన సోమవారం ప్యాపిలి మండలంలో చోటు చేసుకుంది. మృతులు ముగ్గురు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం తూముకూరు జిల్లా చిక్కనాయకనాహళ్లి తాలూకా కెంకెర గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు సంతోశ్(35), నవీన్(43), లోకేశ్(36), స్వామి, దర్శన్, శశిధర్ కలిసి శ్రీశైలం క్షేత్రానికి దర్శనానికి ప్లాన్ చేశారు. రెండు రోజుల కిందట కేఏ 02ఎంకే 44525 నంబర్‌గల ఇన్నోవా కారులో కర్నూలు జిల్లాలోని మంత్రాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆదివారం శ్రీశైల మల్లన్నను దర్శనం చేసుకుని తిరిగి సొంతూరికి బయల్ధేరారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారుకు కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో అదుపుతప్పి కారు డివైడర్‌ను ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మధుసూధన్ పోలీసులతో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి బాధితులను 108 అంబులెన్స్‌లో పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సంతోశ్, నవీన్, లోకేశ్ మృతి చెందగా.. మిగిలిన ముగ్గురు స్పల్పగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతివేగంతో వస్తున్న కారు కుక్కను తప్పించే క్రమంలో ఉన్నఫళంగా బ్రేక్ వేయడంతో కారు బోల్తాపడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో సంతోశ్ బీజేపీ నాయకుడిగా ఉంటూ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. ఈయనకు భార్య లక్ష్మితో పాటు ఒక కుమారుడు సంతానం. అదేవిధంగా లోకేశ్ చిరు వ్యాపారి. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. నవీన్ కూడా తాళ్లూరు పంచాయతీ మాజీ అధ్యక్షుడు. ఈయనకు భార్య క్యావతో పాటు ఓ కుమారుడు సంతానం.