కుర్చీలు వదలరా...?
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:16 AM
కుర్చీలు వదలరా...?
32 ఏళ్లుగా ఒకే చోట తిష్ఠ
27 ఏళ్లుగా కర్నూలులో
వైద్య ఆరోగ్యశాఖ, కర్నూలు జీజీహెచ్‌లో సీట్లు మారని ఉద్యోగులు
బదిలీలకు రెండు రోజులే
ఓ ఫార్మాసిస్టు గత 35 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా కర్నూలుకు రావాలనే ఆశతో బదిలీలకు ఆప్షన్ పెట్టుకున్నారు. కానీ కర్నూలు జీజీహెచ్, రీజనల్ ఐ-హాస్పిటల్స్‌లో పాతిక, ముప్పై ఏళ్లుగా తిష్ఠ వేసినవాళ్లు కదిలేలా లేరు. పైగా గుర్తింపు పొందిన యూనియన్ల సిఫారసు లెటర్ తెచ్చుకున్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న పల్లెటూరి ఫార్మాసిస్టుకు దిక్కుతోచడం లేదు. కర్నూలు డీఎంహెచ్‌వో ఆఫీసులో గత 16 ఏళ్లుగా ఓ మినిస్టీరియల్ స్టాఫ్ తిష్ఠ వేశారు. మరో ఉద్యోగి 14 ఏళ్లుగా కుర్చీ కదలడం లేదు.
కర్నూలు హాస్పిటల్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జీజీహెచ్‌లో ఓ సీనియర్ అసిస్టెంట్ 16 ఏళ్లు తిష్ఠ వేశారు. అందులోనూ 10 ఏళ్లుగా ఆదాయం వచ్చే సీటులో కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆ ఉద్యోగికి ఓ యూనియన్ సిఫారసు లేఖ ఇచ్చింది. మెడికల్ గ్రౌండ్స్ కింద ఇక్కడే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మరో అధికారి కూడా జోనల్ క్యాడర్‌లో లాంగ్ స్టాండింగ్ ఉన్నారు. ఆ అధికారికి కూడా సిఫారసు లేఖ ఉంది. ఇంకా ఇక్కడే ఉండేందుకు ప్రయతిస్తున్నారు.
వైద్య ఆరోగ్య, కర్నూలు బోధనాసుపత్రి, రీజినల్ ఐ-హాస్పిటల్‌లో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి పాతుకుపోయాయి. కొందరు సిల్వర్ జూబ్లీ వేడుకలు పూర్తి చేసుకున్నారు. మరికొందరు 32 ఏళ్లుగా ఉన్నారు. కీలకమైన కర్నూలు జీజీహెచ్, డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో 16 ఏళ్లు దాటినా కదలడానికి ససేమిరా అంటున్నారు. ఈసారి సాధారణ బదిలీల్లో అన్ని సర్వీసులు కలుపుకుని 9 సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులు, ఆఫీస్ బేరర్లను కూడా బదిలీ చేయాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. అదే సీనియర్ అసిస్టెంటక్లు 3 సంవత్సరాలు పూర్తయితే బదిలీ చేయాల్సిందే. అయితే ఈ ప్రభుత్వ నిబంధనలును వైద్యఆరోగ్యశాఖలో కొంతమంది ఉద్యోగులు, అధికారులు తుంగలో తొక్కుతున్నారు. ఏళ్ల తరబడి గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు ఈసారైనా కర్నూలుకు రావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే నగరంలో పాతుకుపోయిన ఉద్యోగులు మాత్రం కుర్చీలు వదలడానికి సిద్ధంగా లేరు. దీని కోసం అడ్డదారులు తొక్కుతున్నారు ఎలాగైనా అక్కడే తిష్ఠ వేయాలని ఎత్తుగడలు పన్నుతున్నారు. కొందరు రాత్రికి రాత్రి ఆఫీస్ బేరర్లుగా నియామక పత్రాలతో బదిలీ కాకుండా చూస్తున్నారు. జిల్లాలో ఇవ్వకుంటే రాష్ట్ర నాయకుల వద్ద నుంచి సిఫారసు లేఖలను తెచ్చుకుంటున్నారు.
వైద్యఆరోగ్య శాఖలో ఉద్యోగులు, వైద్యుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీలోపు బదిలీలు పూర్తి చేసి 23వ తేదీ విధుల్లో చేరాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని డీఎంహెచ్‌వో, జీజీహెచ్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, రీజినల్ ఐ-హాస్పిటల్ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొందరు ఉద్యోగులపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి వైద్యఆరోగ్య శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇతర శాఖల మాదిరిగా కాకుండా బదిలీ నిబంధనలను వైద్య ఆరోగ్యశాఖ కోసం సడలించారు. ఒకేచోట మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన పాలక సిబ్బందిని బదిలీ చేయాలని నిర్ణయించింది.
అన్ని సర్వీసులను కలుపుకుని తొమ్మిదేళ్లు దాటిన వారు, ఆఫీస్ బేరర్లు అయిన వారు, మెడికల్ సర్టిఫికెట్ ఉన్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించింది. అయితే క్యాష్, పలుకుబడి, కులాల ఆధారంగా కొందరిని సంఘాల్లో ఆఫీస్ బేరర్స్‌గా చేర్చుకుని సిఫార్సు లేఖలు అందజేసినట్లు సమాచారం. ఇటీవల ఓ ఉద్యోగ సంఘానికి ప్రభుత్వం గుర్తింపును తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో సంఘం నుంచి సిఫారుసు లేఖల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్లు అందోళనపడుతున్నారు. ఆ సంఘం నుంచి వచ్చే సిఫారసు లేఖలు పక్కన పెట్టాలని ఆదేశాలు రావడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. ఇచ్చిన డబ్బుల కోసం నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు.
జోనల్‌లో అధికంగా సిఫారసు లేఖలు: వైద్యఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్‌డీ) కార్యాలయానికి గుర్తింపు పొందిన సంఘాల సిఫారసు లేఖలు ఎక్కువగా ఉన్నాయి. కడప జోన్-4 క్యాడర్లలో ఏపీ ఎన్జీవో 76 మంది, ఏపీజీఈఏ సంఘం 76 మంది, ఏపీ హంస 68 మంది, ఐఎన్‌టీయూసీ సంఘం 8 మంది, ఏపీ నర్సింగ్ అసోసియేషన్ 6 మందికి సిఫారసు లేఖలు ఇచ్చాయి. . ఇందులో కీలకమైన సీనియర్ అసిస్టెంట్లు ఉద్యోగులకు ఏపీ ఎన్జీవో సంఘం 19 మందికి అత్యధికంగా ఇచ్చింది. . ఏపీజీఈఏ సంఘం ఏడుగురు 7 మంది ఏపీ హంస సంఘం 14 మంది, ఐఎన్‌టీయూసీ సంఘం ఒక్కరికి ఇచ్చారు. ఎంపీహెచ్‌ఎస్ ఉద్యోగులకు ఏపీఎన్‌జీవో 10 మంది, ఏపీజీఈఏ-11, హంస-4, ఎంపీహెచ్‌ఈవో క్యాడర్లలో ఏపీఎన్జీవో-15 మంది, ఏపీజీఈఏ-18, హంస-5, ఎంపీహెచ్‌ఎస్‌ఎం క్యాడర్లలో ఏపీఎన్జీవో-22, ఏపీజీఈఏ-18, ఏపీ హంస-15 మందికి సిఫారసు లేఖలు ఇచ్చారు.
ఏళ్లుగా తిష్ట వేసిన ఉద్యోగులు
వి.విజయలక్ష్మి ఫార్మసీ ఆఫీసర్ రీజినల్ ఐ-హాస్పిటల్, 31 సంవత్సరాలుగా ఒకే చోట పని చేస్తున్నారు. కడప జోనల్ క్యాడల్‌లో ఫార్మసీ ఆఫీసర్ లాంగ్ స్టాండింగ్‌లో మొట్టమొదటి పేరు ఇదే ఉండటం విశేషం.
కర్నూలు జీజీహెచ్‌లో ఫార్మసీ ఆఫీసర్ బి. కృష్ణ మోహన్ 27 సంవత్సరాలుగా ఇక్కడే పని చేస్తున్నారు. లాంగ్ స్టాండింగ్‌లో రెండో స్థానంలో ఉన్నారు.
కర్నూలు జీజీహెచ్ పరిపాలన విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఏ. శ్రీనివాసులు 18 సంవత్సరాలుగా తిష్ట వేశారు. ఆఫీస్ సూపరింటెండెంట్ జోనల్ క్యాడల్ లాంగ్ స్టాండింగ్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నారు.
కర్నూలు డీఎంహెచ్‌వో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ పి. మధుసూదనన్ 16 సంవత్సరాలుగా ఇక్కడే పని చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ జోనల్‌లో లాంగ్ స్టాండింగ్‌లో 3వ స్థానంలో ఉన్నారు.
కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎం. చిరంజీవి 15 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఒకే సీటులో విధులు నిర్వహించడం విశేషం. సీనియర్ అసిస్టెంట్ లాంగ్ స్టాండింగ్ జోనల్‌లో 5వ స్థానంలో ఉన్నారు.
కర్నూలు జీజీహెచ్‌లో పని చేస్తున్న స్టాఫ్ నర్సు సోమేశ్వరి అత్యధికంగా 16 సంవత్సరాలుగా ఇక్కడే పని చేస్తున్నారు. లాంగ్ స్టాండింగ్ స్టాఫ్ నర్సుల జోనల్ లిస్టులో 2వ స్థానంలో ఉంది.
కర్నూలు జీజీహెచ్‌కు చెందిన స్టాఫ్ నర్సు - కే.హైమావతి, 14 సంవత్సరాలుగా పని చేస్తున్నారు.
కర్నూలు జీజీహెచ్‌లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ గత 14 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాడు
ఇది చాలా అన్యాయం
గుర్తింపు పొందిన అసోసియేషన్లు రోసా నిబంధనలకు విరుద్ధంగా బైలాకు వ్యతిరేకంగా ఆఫీస్ బేరర్ల సర్టిఫికెట్లు కేటాయించడం నేరం. ఈ విషాన్ని గుర్తింపు పొందిన సంఘాలు ఆలోచించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఉద్యోగులే తిరగబడే అవకాశం ఉంటుంది. సీహెచ్‌వో రాష్ట్ర క్యాడల్‌లో 68 మంది లాంగ్ స్టాండింగ్ ఉండగా.. ఇందులో 65 మందికి ఆఫీస్ బేరర్ల సర్టిఫికెట్లు ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది. సిఫారసు లేఖలు ఉన్న వారు ఏళ్లుగా సిటీలోనే తిష్ట వేశారు. ఇది అన్యాయం.
-ఎం.నాగరాజు, ఏపీ తెలుగునాడు వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు