Share News

మావోయిస్టు నేత ఫ కమ్యూనిస్టు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:08 AM

చత్తీ్‌సఘడ్‌ రాష్ట్రంలోని చౌకీ జిల్లాలో గల రాజ్‌నంద్‌ గావ్‌- కాంగేర్‌ సరిహద్దులో మూడు రోజుల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేత కామ్రేడ్‌ సుగులూరు చిన్నన్న అలియాస్‌ విజయ్‌కుమార్‌ అంత్యక్రియలు విప్లవ వీడ్కోలు నడుమ సాగాయి.

   మావోయిస్టు  నేత ఫ  కమ్యూనిస్టు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు
వడ్లరామాపురం వడ్లరామాపురంలో ఊరేగింపు

తరలివచ్చిన మాజీ నక్సల్స్‌, అమరవీరుల, బంఽధుమిత్రుల కమిటీ ప్రతినిధులు

మఫ్టీలో వడ్డరామాపురం చేరుకున్న పోలీసులు

అంత్యక్రియలకు హాజరైన వారి వివరాల సేకరణ?

ఆత్మకూరు/ఆత్మకూరురూరల్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): చత్తీ్‌సఘడ్‌ రాష్ట్రంలోని చౌకీ జిల్లాలో గల రాజ్‌నంద్‌ గావ్‌- కాంగేర్‌ సరిహద్దులో మూడు రోజుల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేత కామ్రేడ్‌ సుగులూరు చిన్నన్న అలియాస్‌ విజయ్‌కుమార్‌ అంత్యక్రియలు విప్లవ వీడ్కోలు నడుమ సాగాయి. శనివారం ఉదయం 11గంటల సమయంలో ఆయన మృతదేహం స్వగ్రామమైన ఆత్మకూరు మండలంలోని వడ్లరామాపురం గ్రామానికి చేరుకుంది. అప్పటికే గ్రామానికి మాజీ మావోయిస్టులు, విరసం సభ్యులు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధులు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ పార్టీ, జనశక్తి, పౌరహక్కుల సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చిన్నన్న మృతదేహంపై ఎర్రజెండా కప్పి విప్లవ జోహార్లు అర్పించారు. ఎర్రజెండాలతో కవాతు నడుమ ఆయన మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామశివారులోని ఆయన సొంత పొలంలో కమ్యూనిస్టు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ సందర్భంగా పలువురు మావోయిస్టు నేత సుగులూరు చిన్నన్నతో తమకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. ప్రత్యేకించి విప్లవ రచయితల సంఘం సభ్యుడు పినాకపాణి, న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహయ్య, జనశక్తి నేత సుంకన్న మాట్లాడుతూ పాతికేళ్ల క్రితం నల్లమల ప్రాంతంలో భూస్వామ్య వ్యతిరేక, అగ్రకుల అణచివేత, దళిత ఆత్మగౌరవ, ఫ్యాక్షనిజం, మహిళల వ్యక్తిత్వానికి సంబంధించి జరుగుతున్న విస్తృత స్థాయి పోరాటాల్లో జరిగాయన్నారు. అదేక్రమంలో భవనాశి దళం పేరిట జరిగిన అనేక రైతాంగ, భూస్వాధీన పోరాటాలు, అగ్రకులాల అన్యాయాలకు వ్యతిరేకంగా పీపుల్స్‌ వార్‌ ఉద్యమాలు జరిగిన సందర్భంలో ఒక మామూలు దళిత వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కామ్రేడ్‌ చిన్నన్న విప్లవోద్యమం వైపు బాటలు వేశారని అన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రజా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఇదిలావుంటే చిన్నన్న అంత్యక్రియల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులు మఫ్టీలో వడ్లరామాపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వివిధ ప్రజా సంఘాల నేతలు, మాజీ మావోయిస్టుల పేర్లను ఆరా తీసినట్లు తెలిసింది. సుగులూరు చిన్నన్నతో వారికి ఉన్న అనుభవాలను పంచుకున్న వ్యక్తుల వివరాలు, వ్యక్తల ప్రసంగాలను సేకరించినట్లు సమాచారం. అంత్యక్రియల్లో హాజరైన వారిలో ప్రముఖ వైద్యులు నాగన్న, గౌరీనాథ్‌, పద్మ, అంజమ్మ ఉన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:08 AM