కర్నూలు మీదుగా బుల్లెట్ ట్రైన్..!
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:43 AM
కర్నూలు మీదుగా బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు హైస్పీడ్ బుల్లెట్ రైలు వాయువేగంతో పరుగులు పెట్టనుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 626 కిలోమీటర్లు పొడవు హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణం కోసం రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ సర్వే నిర్వహిస్తోంది.
రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ సర్వే
కర్నూలు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మీదుగా బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు హైస్పీడ్ బుల్లెట్ రైలు వాయువేగంతో పరుగులు పెట్టనుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 626 కిలోమీటర్లు పొడవు హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణం కోసం రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ సర్వే నిర్వహిస్తోంది. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ - బెంగళూరు వయా మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్ కారిడార్లు నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు దూసుకుపోవడానికి వీలుగా హైస్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. హైదరాబాద్ - బెంగళూరు కారిడార్ ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించిందని రైల్వే అధికారులు అంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారిలో నిమగ్నమయ్యారు. 621.8 కిలోమీటర్లు, 576.6 కిలో మీటర్లు, 558.2 కిలోమీటర్లు పొడవుతో నిర్మించేలా మూడు ఎలైన్‌మెంట్లు పరిశీలిస్తున్నారు. ఈ కారిడార్‌లో భాగంగా ఏపీలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందుపురం రైల్వే స్టేషన్లు నిర్మించేలా ప్రతిపాధించారు. ఏపీలో 263.3 కిలోమీటర్లు, తెలంగాణలో 218.5 కిలో మీటర్లు, కర్ణాటకలో 94.80 కిలోమీటర్లు హైస్పీడ్ రైలు మార్గం నిర్మిస్తారు. డబుల్ లైన్, లూప్‌లైన్స్, సైడింగ్‌లు కలిపి మొత్తం 1,363 కిలోమీటర్లు రైలు మార్గం నిర్మాణానికి సర్వే జరుగుతుంది. ఈ సర్వేను రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ సర్వే నిర్వహిస్తోంది. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రైన్ వేగాన్ని బట్టి కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా తుంగభద్ర, హంద్రీ నదులపై నూతన రైల్వే వంతెనలు నిర్మించాల్సి ఉంది. తుంగభద్ర నదిలో వంతెనల నిర్మాణం కోసం జియోటెక్నికల్ ఇన్వేస్టిగేషన్ కోసం బోర్ హోల్స్ వేయాల్సి ఉంది. అందుకు అనుమతి కోరుతూ రైట్స్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజరు సౌరబ్ మంగళవారం జలవనరుల శాఖ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డికి లేఖ రాశారు.