తెల్లారిన జీవితాలు!
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:14 AM
తెల్లారిన జీవితాలు!
కోటేకల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
మలుపు వద్ద రెండు కార్లు ఢీ
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం
మృతుల్లో ఇద్దరు చిన్నారులు
కన్నతండ్రి ఒడిలోనే శాశ్వతనిద్రలోకి బాలుడు
అతివేగమే ప్రమాదానికి కారణం
మంత్రాలయం శ్రీమఠానికి వెళ్తుండగా ఘటన
మృతులంతా కర్ణాటక వాసులు
ఉన్నత చదువులు.. మంచి ఉద్యోగాలు.. ప్రేమకు ప్రతిరూపంగా ముద్దులొలికే బాలుడు. ఆ అందమైన కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వాళ్లు రాత్రంతా కారు ప్రయాణం చేశారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకునేవారు. అంతలోనే రోడ్డు ప్రమాదం. ఐదుగురు మృతి చెందారు. సతీష్, అతని భార్య మీనాక్షి, కొడుకు రిత్విత్ కన్ను మూశారు. నాలుగేళ్ల ఈ చిన్నారి తండ్రి గుండెలపై నిద్రిస్తూ అటే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. వెనుక సీట్లో ఉన్న మరో చిన్నారితో పాటు ఒకరు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసు కుంది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
ఎమ్మిగనూరు/ ఆదోని రూరల్, నవంబరు 29( ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా మాలూరు తాలుకా నెల్లల్లి గ్రామానికి చెందిన కిష్టప్ప, సరస్వతమ్మలకు ఇద ్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు సతీ్‌ష(34)కు ఎనిమిదేళ్ల క్రితం బంగారుపేట తాలుకా, చిక్కహోసల్లి గ్రామానికి చెందిన వెంకటేషప్ప(72), గంగమ్మల కుమార్తె మీనాక్షి(32)తో వివాహం జరిగింది. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో స్థిరపడ్డారు. వీరికి రిత్విక్(4) కుమారుడు సంతానం. ఇటీవల సతీష్ బెంగళూరు పట్టణంలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. 15రోజుల క్రితం సొంత గ్రామమైన నెల్లల్లికి చేరుకున్నారు. ఈనెల 27వ తేదీన వారు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలనే మొక్కుబడిలో భాగంగా సతీష్ దంపతులు, అత్తమామలతో కలిసి మంత్రాలయం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి నెల్లల్లి గ్రామం నుంచి తన తమ్ముడు సుధాకర్ కారులో మిత్రుడు చేతన్ (డ్రైవర్)తో కలిసి రాత్రి 8గంటల సమయంలో అత్త మామ గ్రామమైన చిక్కహళ్లికి చేరుకున్నారు. అక్కడ అత్త, మామలు వెంకటేశప్ప, గంగమ్మ, వెంకటేశప్ప మనవడు బనిత్‌గౌడ్(5)ను ఎక్కించుకొని రాత్రి 10గంటల సమయంలో మంత్రాలయానికి బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కేఎ07బీ 9672 నంబర్‌గల షిఫ్ట్ డిజైర్ కారు శనివారం తెల్లవారు జామున 4:20 గంటల సమయంలో ఆదోని మండలం ఆరెకల్లు, ఎమ్మిగనూరు మండలం కొటేకల్లు మధ్యలో ఎన్‌హెచ్ 167 జాతీయ రహదారిలో ఉన్న మలుపు వద్దకు చేరుకుంది.
. అక్కడ ఎదురుగా ఆదోని వైపునకు వస్తున్న ఏపీ39 ఎస్‌ఎస్2020 నంబర్ గల ఫార్చునర్ కారు ఒకటికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో దంపతులు సతీష్ కుమార్, మీనాక్షి, వారి కుమారుడు రిత్విక్‌తో పాటు మీనాక్షి తండ్రి వెంకటేషప్ప, మేనల్లుడు బనిత్‌గౌడ్‌లు కారులోనే ఇరుక్కొని మృత్యువాత పడ్డారు. మీనాక్షి తల్లి గంగమ్మ, డ్రైవింగ్ చేస్తున్న చేతన్‌లకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. అలాగే ఫార్చునర్ కారులో ప్రయాణిస్తున్న అశోక్, జాహ్నవి, రాధికతో పాటు డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆదోనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గంగమ్మ, చేతన్‌లను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.
కూలిన కలల సౌధం...
సతీష్, మీనాక్షి ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో స్థిరపడ్డారు. సంపాదించినదాంట్లో కొంత పోగు చేసి బెంగళూరులోనే నివాసం ఉండడానికి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకొని మూడు రోజుల క్రితం తమ వివాహ వేడుకను జరుపుకొని బెంగళూరుకు వెళ్లేలోపు మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శనం చేసుకోవాలని మొక్కుకున్నారు. అందులో భాగంగానే కారులో భార్య, కొడుకు, అత్తా, మామ, అల్లుడితో కలసి సతీష్ కారులో రాత్రి పదిగంటలకు అత్తమామల స్వగ్రామం నుంచి మంత్రాలయానికి బయల్దేరారు. మధ్యమధ్యలో తీపిజ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారి ప్రయాణాన్ని సాగించారు. శనివారం ఉదయం దైవదర్శనం చేసుకొని తిరిగి సొంత గ్రామానికి చేరుకోవాలని రెండు రోజుల్లో బెంగళూరుకు వెళ్లి విధులకు వెళ్లాలని సతీష్, మీనాక్షి మాట్లాడుకున్నారు. చల్లగాలికి నిద్ర రావడంతో మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఎవరి సీట్లలో వారు కునుకు తీశారు. సతీష్ ముందు సీటులో తన కుమారుడు రిత్విక్‌ను ఒడిలో కూర్చొ బెట్టుకున్నాడు. వెనక్కి సీటులో భార్య మీనాక్షి, తన అమ్మ, నాన్నలు, అన్న కుమారుడు బనిత్‌గౌడ్ కూర్చొని నిద్రలోకి జారుకున్నారు. ఒక గం టలో మంత్రాలయం రాఘవేంద్రస్వామి క్షేత్రానికి చేరుకోవాల్సిన వారు కారు ప్రమాదంలో కన్నుమూశారు.
నాన్న ఒడిలోనే చివరిశ్వాస
ఏబిడ్డకైనా తన నాన్న ఒడి మృత్యుఒడి అవుతుందా? కాదు.. కానీ చిన్నారి రిత్విక్ విషయంలో మాత్రం తన నాన్న ఒడే మృత్యు ఒడి అయింది. ‘నాన్నా నేను అమ్మ తో ఉండను. నీతోనే కూర్చుంటా’ అంటూ గారాం చేసిన బాలుడు రిత్విక్‌ను తండ్రి చేరదీసి తన ఒడిలో పడుకోబెట్టుకుని జోకొట్టి నిద్రపుచ్చాడు. కుమారుడు నిద్రలోకి జారుకోగానే సతీ్‌షకూడా కునుకు తీశాడు. ఘోర రోడ్డు ప్రమాదం జరిగి వీరు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న కారు ఒకటికొకటి ఢీకొనడంతో కూర్చున్న చోటే తండ్రి కొడుకులు విగత జీవులయ్యారు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన స్థానికులు ‘అయ్యో పాపం.. దేవుడు ఎంత పనిచేశాడు.. పసికందులను సైతం తీసుకెళ్లాడు.. పాపం తండ్రి ఒడిలోనే ఆ కొడుకు చనిపోయాడు...’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
బతికించిన ఎయిర్‌బ్యాగ్స్!
విశాఖపట్నానికి చెందిన అశోక్ చౌదరి.. భార్య రాధిక, కుమార్తె జాహ్నవితో కలసి ఆదోనికి బయలుదేరారు. వారి సమీప బంధువుల రిసెప్షన్ ఉండటంతో విశాఖ నుంచి విమానంలో హైదరాబాదు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆదోనికి చెందిన ఫార్చునర్ కారులో ఆదోనికి బయల్దేరారు. వీరి వాహనం ఆరేకల్లు, కొటేకల్లు మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న కర్ణాటక కారు ఒకటికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక కారులో ప్రయాణిస్తున్న ఐదు మంది మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. కాని వీరు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారుకు ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో మాత్రమే బయటపడ్డారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఐజీ
కొటేకల్లు, ఆరెకల్లు గ్రామాల మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సమాచారం తెలుసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఏఎస్పీ హుసేన్‌పీరా, జేసీ నూరుల్ కామర్, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తెల్లవారు జామున 4:20 గంటలకు ప్రమాద సంఘటన జరగడంతో సమాచారం తెలుసుకున్న డీఎస్పీ భార్గవి, సీఐలు చిరంజీవి, శ్రీనివాసులు, మంజునాథ్, నల్లప్ప, రామాంజులు, ఎస్‌ఐలు శ్రీనివాసులు, మల్లికార్జున, రామాంజనేయులు, తహసీల్దార్ శేషఫణి, పోలీసు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌లను పిలిపించుకొని గాయపడిన వారిని ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే కారులో ఇరుక్కుపోయిన ఐదుగురి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మృతుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రమాదాల నివారణకు
చర్యలు తీసుకుంటున్నాం
ఎమ్మిగనూరు రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కొటేకల్లు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరగడం చాలా బాధాకరమని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ విచారం వ్యక్తం చేశారు. ఎదురెదురుగా వస్తు రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం శోచనీయమన్నారు. మలుపుల వద్ద బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు రాత్రివేళల్లో ఫేష్‌వాష్ వంటి కార్యక్రమాలను చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించామన్నారు. వాహనదారులు కూడా రోడ్డు భద్రతానియమాలను పాటించాలన్నారు.