Share News

పూర్తికాని వంతెన

ABN , Publish Date - May 27 , 2025 | 12:22 AM

ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలను కలిపే జాతీయ రహదారి 167 పనుల్లో భాగంగా హాలహర్వి మండలం చింతకుంట వద్ద వంతెన నిర్మాణం ఆగిపోయింది. తాత్కాలిక వంతెన వర్షం దెబ్బకు కొట్టుకుపోయింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పత్తా లేడు.

పూర్తికాని వంతెన
జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

చింతకుంట వద్ద జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

పత్తాలేని కాంట్రాక్టర్‌, అవస్థలు పడుతున్న వాహనదారులు

హాలహర్వి, మే 26(ఆంధ్రజ్యోతి): మూడు రాష్ర్టాలను కలిపేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం 167 జాతీయ రహదారిని ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసింది. ఈ రహదారి కర్ణాటక రాష్ట్రం హగరి వద్ద ప్రారంభమై ఆంధ్ర సరిహద్దు చింత కుంట మీదుగా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూరు నుంచి తెలంగాణ రాష్ట్రం జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, మిర్యాలగూడ, కోదాడ వరకు మొత్తం 483 కి.మీ.లు ఉంటుంది.

కర్ణాటకలో పూర్తయిన రహదారి

విడతలవారీగా నిధులు మంజూరు చేస్తూ, రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో ఐదేళ్ల క్రితమే పనులు పూర్తి కాగా మన రాష్ట్రంలో మాత్రం పెండింగ్‌ పడింది. చింతకుంట నుంచి ఆదోని వరకు రహదారి నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేశారు.

తెగిన తాత్కాలిక వంతెన

వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల దెబ్బకు కట్రవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి వాహ నాల రాకపోకలకు ఆటంకటం ఏర్పడింది. హగరి, ఉరవకొండ, అనంత పురం, ఆదోని, ఆలూరు, బళ్లారి, కర్నూలు వెళ్లే వాహనా రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. ఈ రహదారిపై వచ్చిన వాహనదారులు వంతెన పరిస్థితి చూచి మళ్లీ వెనక్కు వెళ్లిపోతున్నారు.

నిలిచిన పనులు

ఆంధ్ర సరిహద్దు నుంచి ఆదోని వరకు ఎస్‌ఆర్‌కె సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఆరేళ్ల క్రితమే పనులు వేగవంతం చేసింది. అయితే హాలహర్వి మండలం చింతకుంట వద్ద నిర్మాణం ఆగిపోయింది. ఆలూరు వద్ద రోడ్డు కేవలం పట్టణంలో మాత్రమే రోడ్డు నిర్మించి మిగతా చోట్ల వదిలేశారు.

పత్తాలేని కాంట్రాక్టర్‌

పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పత్తా లేడు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించు కోవడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఇటువైపు రావడమే మానేశారు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు.

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లా

చింతకుంట వాగుపై వంతెన పనులు ఐదేళ్లుగా నిలిచిపోయాయి. చిన్న వర్షం వచ్చినా తాత్కాలిక వంతెను కొట్టుకుపోతుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌ తీరుపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాను. - విరుపాక్షి, ఎమ్మెల్యే, ఆలూరు

కాంట్రాక్టర్‌పై చర్యలకు నివేదిక పంపాం

చింతకుంట నుంచి ఆదోని వరకు జాతీయ రహదారి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతా ధికారులకు నివేదిక పంపాం. కనీసం వంతెన నిర్మాణాన్మి పూర్తి చేయాలని చెప్పినా కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదు. వర్షాలు ఆగిపోతే తాత్కాలిక వంతెన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. - శంకర్‌రెడ్డి, నేషనల్‌ హైవే ఈఈ, కర్నూలు

Updated Date - May 27 , 2025 | 12:22 AM