లంచం.. లాంఛనం!
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:46 PM
మద్యం వ్యాపారంలో లంచం.. లాంఛనంగా మారింది. చట్ట విరుద్ధంగా జరిగే పని నేరంగా కాక ఆనవాయితీగా మారిపోయింది.
మద్యం షాపుల్లో మామూళ్ల దందా
ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఇవ్వాల్సిందే
ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్, పోలీసు అధికారులకు వాటాలు?
నెలకు రూ.కోటికి పైగా చేతులు మారుతున్న వైనం
మామూళ్ల మత్తులో కళ్లకు గంతలు కట్టుకున్న నిఘా యంత్రాంగం
మద్యం వ్యాపారంలో లంచం.. లాంఛనంగా మారింది. చట్ట విరుద్ధంగా జరిగే పని నేరంగా కాక ఆనవాయితీగా మారిపోయింది. నిబంధనలను తుంగల్లో తొక్కడం వల్లే మద్యం వ్యాపారం అత్యంత లాభసాటి అయింది. ఇట్లా వ్యాపారం చేయాలంటే నెల నెలా మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. దీంతో లంచాలు ఇచ్చే వాళ్లకు తప్పనిసరి అయింది. తీసుకొనేవాళ్లు హక్కుగా భావించే పరిస్థితి వచ్చింది. కాదు.. కూడదంటే అధికారులకు నిబంధనలు గుర్తుకొస్తాయి. కేసులు నమోదు చేస్తారు. ఇంకా దూరంపోయి లైసెన్స్ రద్దు చేస్తామంటారు. ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల చొప్పున అంటే.. నెలకు రూ.కోటికిపైగా చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, కొందరు ఎక్సైజ్, పోలీసు అధికారులకు వాటాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
కర్నూలు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణ ఉన్న ఏడు స్టేషన్ల పరిధిలో 110 మద్యం షాపులు, 23 బార్లు ఉన్నాయి. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ పేరిట ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు చేసింది. సంపూర్ణ మద్య నిషేధం 2019 ఎన్నికల్లో వైసీపీ హామీ. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారు. ధరలు పెంచితే మద్యం మానేస్తారని మద్య నిషేధానికి కొత్త నిర్వచనం చెప్పి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ప్రముఖ బ్రాండ్ల మద్యం సరఫరా ఆపేసి.. ఇచ్చింది తాగండి..! అన్నట్లు మునుపెన్నడు చూడని బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలకు పెట్టారు. దీనిపై మద్యం ప్రియుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాల పాలసీని రద్దు చేసింది. లాటరీ ద్వారా మద్యం దుకాణాలు లైసెన్స్ విధానం అమలులోకి తెచ్చింది. ప్రైవేటు వ్యాపారులకు అప్పగించారు. అంతేకాదు.. ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ధరలు కూడా తగ్గించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాకు చెందిన అనుమతి లేని మద్యం, నాటు సారాను నియంత్రించాలనే లక్ష్యంగా రూ.99కే క్వాటర్ నాణ్యమైన లిక్కర్‌ను తీసుకొచ్చారు. ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో నెలకు సగటున రూ.65-70 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. ప్రస్తుతం రూ.95-105 కోట్లకు పైగా విక్రయాలు జరుగుతున్నాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్రైజ్ అధికారులు పేర్కొంటున్నారు. అదే స్థాయిలో నెల మామూళ్లు కూడా పెంచేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయ నేతలకు రూ.కోటికి పైగా వాటాలు?
రాజకీయ ప్రముఖ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్, పోలీసు అధికారులకు మద్యం ఆదాయ వనరుగా మారింది. మద్యం అమ్మకాలు జరిగేదీ లేనిదీ మీరు చూసుకోవాల్సిందే..! మాకు మాత్రం నెలనెలా మామూళ్లు ఇవ్వాలందే అన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహ రిస్తున్నానే విమర్శలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు కొందరు మామూళ్లు వసులు చేసే ఏజెంట్లుగా మారారనే ఆరోప ణులు ఉన్నాయి. మద్యం అమ్మకాలను బట్టి ఒక్కో దుకాణం నుంచి నెలనెలా రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పైగా మామూళ్ల కింద ఇచ్చుకోవాల్సి వస్తుందనే ఆరోపణులు ఉన్నాయి. ఇంత జరిగినా మామూళ్లు ముట్టజెప్పడం, తీసుకోవడం లాంఛనంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధికి రూ.45- 50 వేలు, కొందరు ఎక్సైజ్ అధికారులకు రూ.45 వేలు, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు రూ16-20 వేల వరకు వస్తుందని పేరు బయటకు చెప్పుకోలేని ఓ మ ద్యం వ్యాపారి వాపోయాడంటే ఏ స్థాయిలో అవినీతి పేరుకుపోయిందో తెలుస్తున్నది. ఈ లెక్కన జిల్లాలో 110 మద్యం దుకాణలు నుంచి నెలనెలా రూ.కోటికి పైగా వాటా రూపంలో పలువురి చేతులు మారుతున్నట్లు ఆరోపణులు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ నియోజక వర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధి ఒకరు ఒక్కో మద్యం షాపు నుంచి నెలనెలా రూ.50-75 వేలు తనకు తెచ్చి ఇవ్వాలని, తన అనుమతితో నిర్వహించే మద్యం దుకాణాల నుంచి మామూళ్లు తీసుకోరాదని ఓ ఎక్సైజ్ సీఐని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సదరు సీఐ జిల్లా ఉన్నతాధికారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మరో నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధి సోదరుడు మద్యం షాపులను సిండికేట్‌గా ఏర్పాటు చేసి లాభాల్లో తన వాటాగా 40 శాతం, లైసెన్స్‌దారులు, అనుచరులకు 60 శాతం ఇస్తున్నారని సమాచారం. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ నియోజకవర్గంలో ప్రతి దుకాణం నుంచి ఒక రేటు చొప్పున ముఖ్య రాజకీయకుడి నెల మామూళ్లు వెళ్తున్నాయనే ఆరోపణులు లేకపోలేదు. ఈ నియోజకవర్గంలో ఎక్సైజ్ సీఐ ఒకరు అన్నీతానై మద్యం షాపుల నుంచి నెల మామూళ్లు వసులు చేసి కొందరు రాజకీయ నాయకులు, అధికారులకు వాటాలు పంచుతున్నారనే ఆరోపణులు ఉన్నాయి.
పల్లె పల్లెన బెల్ట్‌షాపులు
గ్రామాల్లో బెల్ట్ షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా అమలు కావడం లేదు. జిల్లాలో ఏ పల్లెకు వెళ్లినా మద్యం బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. నెలనెలా మామూళ్లు అందుతుం డడంతో ఎక్సైజ్ నిఘా యంత్రాంగం, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. మద్యం వ్యాపారంలో 30-40 శాతం వాటా బెల్ట్ షాపుల నుంచి వస్తుందని ఎక్సైజ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీన్నిబట్టి ఇవి ఏ స్థాయిలో విస్తరించిందీ తెలుసుకోవచ్చు. కేసులు కోసం అప్పుడప్పుడు నామమాత్రపు దాడులతో సరిపుచ్చుతున్నారు. అంతేకాదు.. వైన్ షాపుల వద్ద, రోడ్లుపైనే మద్యం తాగుతున్నా అడిగేవారు లేరు. షాపులను బార్లుగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు నగరంలో మదర్ థెరిసా సర్కిల్‌కు సమీపంలో నివాస గృహాల పక్కనే ఏర్పాటు చేసిన ఓ వైన్ షాపును బారుగా మార్చేశా రని స్థానికులు ఆరోపిస్తున్నారు. నేషనల్ హైవే పక్కనే ఉన్న డాబాలు అనధికారిక బార్లుగా మార్చేసినా అడిగేవారు లేరు. ఎమ్మిగనూరు, మంత్రాల యం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గం కేంద్రాల్లో వైన్ షాపుల వద్ద రోడ్లపైనే మద్యం సేవిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణులు ఉన్నాయి. అయితే.. ప్రభుత్వం మద్యం అమ్మకాలు టార్గెట్ పెట్టిందని, బెల్ట్ షాపులు నియంత్రిస్తే.. టార్గెట్ సాధ్యం కాదని, తద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని, అందువల్ల చూసీ చూడనట్లుగా వెళ్తున్నామని ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు.
మామూళ్లు ఇవాల్సిన అవసరం లేదు
మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు ఎవరికీ మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డిమాండ్ చేస్తే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అక్కడక్కడా బెల్ట్ షాపులు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. నిఘా ఉంచి దాడులు చేస్తున్నాం.
సుధీర్‌బాబు, సూపరింటెండెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, కర్నూలు