Share News

ఆసుపత్రి ప్రారంభానికి బ్రేక్‌

ABN , Publish Date - May 16 , 2025 | 12:00 AM

పట్టణంలో నాబార్డు నిధులు రూ.1.70 కోట్లతో నిర్మిచిన ఆసుపత్రి నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సోమవారం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆసుపత్రి ప్రారంభానికి బ్రేక్‌
ఆలూరులో సిద్ధమైన ఆసుపత్రి నూతన భవనం

అధికార పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వని అధికారులు

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌

ఆలూరు, మే15 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో నాబార్డు నిధులు రూ.1.70 కోట్లతో నిర్మిచిన ఆసుపత్రి నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సోమవారం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని ఇంజనీరింగ్‌ అధికారులు ఆహ్వానించారు. అధికార పార్టీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌కు కనీస సమాచారం ఇవ్వలేదు. మరోవైపు ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రారంభిస్తారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తుండటంతో టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వీరభద్రగౌడ్‌

ఆసుపత్రిని మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు చేతులమీదుగా ప్రారంభించాలని అనుకున్నామని, మరి ఇప్పుడు ఎమ్మెల్యే చేత ఎలా ప్రారంభిస్తారని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆసు పత్రి ప్రారంభాన్ని తాత్కాలికంగా ఆపేయాలని వైద్యశాఖ అధికారుల నుంచి సూపరింటెండెంట్‌ వహీద్‌కు ఫోన్‌లు రావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. మరోవైపు అధికార, ప్రతిపక్ష నాయకుల వైఖరితో ప్రారంభం నిలిచిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై ఆసుపత్రి వైద్యుడు వహీద్‌ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదావేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - May 16 , 2025 | 12:00 AM