మరణించాడు.. ప్రాణదాత అయ్యాడు..!
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:15 AM
రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడు అవయవదానంతో ప్రాణదాత అయ్యాడు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్త బనకచర్ల చెందిన మొలక తరుణ్(21) అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈనెల 9వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు
యువకుడు బ్రెయిన్ డెడ్ ఫ నలుగురికి అవయవదానం
తల్లిదండ్రులను అభినందించిన వైద్యులు
కర్నూలు హాస్పిటల్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడు అవయవదానంతో ప్రాణదాత అయ్యాడు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్త బనకచర్ల చెందిన మొలక తరుణ్(21) అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈనెల 9వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. 10వ తేదీన కర్నూలు గౌరిగోపాల్ హాస్పిటల్‌కు తరలించారు. 14వ తేదీన మెరుగైన చికిత్సకోసం మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయువకుడిని 16వ తేదీన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. ఈపరిస్థితుల్లో యువకుని తల్లిదండ్రులు మొలకరాజు ఈశ్వరమ్మకు అవయవదానంపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు దాతృత్వాన్ని చాటుకుని అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌లో జీవన్‌దాన్ ద్వారా లైసెన్సు పొందడంతో గురువారం కర్నూలు మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్‌వోడీ డా.సాయిసుధీర్ నేతృత్వంలో మెడికవర్ హాస్పిటల్‌లో అవయవాలను సేకరించారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డా.అబ్దుల్ సమద్ (యురాలజిస్టు), డా.సిద్దార్థ హెరూర్(నెఫ్రాలజిస్టు) డా.ప్రవీణ్ (అనస్థీషి యా) ద్వారా అవయవాలను సేకరించి గ్రీన్‌చానల్ ద్వారా కర్నూలు హైదరాబాదుకు తరలించారు. రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని కర్నూలు జీజీహెచ్‌కు, మరో కిడ్నీ, లివర్‌ను కర్నూలు కిమ్స్ హాస్పిటల్, లంగ్స్‌ను హైదరాబాదు కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అవయ వదానంకు అంగీకరించిన తల్లిదండ్రులను ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.ఎల్.భాస్కర్, మెడికవర్ హాస్పిటల్ కర్నూలు క్లస్టర్ హెడ్ మహేశ్వరరెడ్డి అభినందించారు.