బోగస్: 60 వేలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:33 PM
గత వైసీపీ పాలనలో ఉపాఽధి హామీ పథకం ఆ పార్టీ నాయకులు, అను చరుల జేబు నింపింది.
ఉపాధి హామీలో అక్రమ జాబ్‌కార్డులు
గత వైసీపీ పాలనలో అక్రమం
బోగస్ జాబ్‌కార్డులతో నిధులు స్వాహా
కూటమి పాలనలో ఏరివేత
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో ఉపాఽధి హామీ పథకం ఆ పార్టీ నాయకులు, అను చరుల జేబు నింపింది. కూటమి ప్రభుత్వం ఆధార్, ఈకేవైసీ తదితర కార్యక్రమాల ద్వారా బోగస్ జాబ్ కార్డుల ఏరివేత కార్యక్రమంలో ఇదంతా బైటపడింది. కర్నూలు జిల్లాలో 44,444 జాబ్‌కార్డులు బోగస్ అని తేలింది. నంద్యాల జిల్లాలో 17,663 బోగస్ జాబ్‌కార్డులను తొల గించారు. తమ అధికార బలంతో బోగస్ పేర్లు రికార్డుల్లో నమోదు చేయించి రూ. కోట్లల్లో నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 60వేల జాబ్‌కార్డుల తొలగింపు
కర్నూలు జిల్లాలో గత వైసీపీ పాలనలో 2,98,276 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇచ్చారు. వారందరికీ వంద రోజుల పనిదినాలు కల్పించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో 2,50,117 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇచ్చారు. ఇవన్నీ ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న గ్రామాల్లోని నాయకులు బోగస్ జాబ్‌కార్డులని తేలింది. వీటి ద్వారా వైసీపీ నాయకులు జేబులు నింపుకున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఏరివేత కార్యక్రమంలో వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకుంటున్న ఈ అక్రమాలను సరి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను అమలు చేశాయి. పని చేసే కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో బోగస్ కూలీల చిట్టా బయటపడుతోంది. కర్నూలు జిల్లాలో 44,444 జాబ్‌కార్డులు బోగస్ అని తేలింది. నంద్యాల జిల్లాలో 17,663 బోగస్ జాబ్‌కార్డులను తొలగించారు. మృతులు, గ్రామాలు వీడిన వారు ఇతరత్రా 60వేల మంది ఉమ్మడి జిల్లాలో ఆచూకీ లేకపోవడంతో వారి కార్డులను రద్దు చేశారు. మరో 30 వేల మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున వైసీపీ నాయకుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బోగస్ కూలీల పేరుతో నిధుల స్వాహా చేసినట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు చేపట్టిన చర్యలతో బట్టబయలైంది.
వైసీపీ సానుభూతిపరులకు
గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని చూపించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాలో రూ.400 కోట్లతో వివిధ రకాల పనులు ఏటా చేయిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. ఆ పార్టీ సానుభూతిపరులకు ఉపాధి హామీ కూలీ పెద్దమొత్తంలో చెల్లించారనే వాదనలు వినిపిస్తున్నాయి. సామాజిక తనిఖీల్లో కూడా అవి బయటపడకుండా నాయకుల ఒత్తిళ్లతో సిబ్బంది జాగ్రత్త పడ్డారు. కొంత మంది క్షేత్ర సహాయకులు కూలీలు హాజరు కాకపోయినా వచ్చినట్లు, పని జరగకపోయినా జరిగినట్లు రికార్డుల్లో రాసేసుకుని ప్రభుత్వ సొమ్మును జేబుల్లో నింపుకుంటున్నారు. రెండు జిల్లాలో కలిపి దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఉపాధి హామీ పథకం అమలులో దుర్వినియోగం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బోగస్ కార్డుల ఏరివేత చేపట్టాం
కర్నూలు జిల్లాలో 2,98,276 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇచ్చాం. . దాదాపు 5,56,672 మంది కూలీలు ఈ పథకం ద్వారా వంద రోజులు పనులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బోగస్ కూలీలను ఏరివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కార్డు, ఈకేవైసీ ద్వారా బోగస్ కూలీల పేర్లు ఏరివేశాం. ఈకేవైసీ చేయించుకోని కూలీల జాబ్‌కార్డులు తొలగిస్తున్నాము. వాస్తవంగా గ్రామంలోనే ఉండి ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న వారు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలి. లేకపోతే వాటి జాబ్‌కార్డులను తొలగిస్తాం.
- వెంకటనారాయణ, డ్వామా పీడీ