Share News

రక్తపుగట్టు

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:58 PM

దేవరగట్టు బన్ని ఉత్సవంలో హింస చెలరేగింది

రక్తపుగట్టు

దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో పగిలిన తలలు

తలపగిలి ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతి

90 మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి ఆందోళనకరం

ఉత్సవమూర్తుల కోసం గ్రామాల మధ్య కర్రల సమరం

సంప్రదాయం పేరిట ఆటవిక ఆచారం

దేవరగట్టు బన్ని ఉత్సవంలో హింస చెలరేగింది. దేవుడి దక్కించుకునే క్రమంలో గ్రామాల మధ్య జరిగిన కర్రల పోరులో ఇద్దరు మృతి చెందగా మరో 90 మందికి దాకా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దసరా రాజున జరిగిన బన్ని ఉత్సవం రక్తసిక్తంగా మారింది. గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం తర్వాత దేవతామూర్తుల ఊరేగింపు మొదలైంది. ఉత్సవమూర్తులను తమ గ్రామాలకు తీసుకెళ్లేందుకు రెండు వర్గాల ప్రజలు పోటీ పడ్డారు. మాళ మల్లేశ్వర స్వామి బన్ని జైత్రయాత్రలో రెండు వర్గాల ప్రజలు కర్రలతో ఘర్షణకు దిగారు. ఉత్సవమూర్తులను తీసుకెళ్లే విషయంలో పోటీపడటంతో హింస మొదలైంది.

ఆలూరు/హొళగుంద/ఆలూరు రూరల్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని ఉత్సవం ప్రతి ఏటా దసరా పండుగ రోజున నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా మాళమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు మూడు గ్రామాల ప్రజలు మరోవైపు కర్రలతో కొట్టుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అందులో భాగంగానే గురువారం దసరా రోజున ఉదయం నుంచి రాత్రి వరకు మాళమల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి డిర్ర్‌ర్ర్‌ర్ర్‌... గో పరాక్‌ అంటూ భక్తులు నినాదాలు చేస్తూ ఇనుప రింగులు తొడిగిన కర్రలు, అగ్ని కాగడాలతో బన్ని (కర్రల సమరం) ఉత్సవంలో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఒళ్లు గగుర్పాటు కలిగించేలా సాగిన ఈ సమరంలో నెరణికి, నెరణికితండా, కొత్తపేట, ఎల్లార్తి, అరికెర, అరికెరతండా, బిలేహాల్‌ గ్రామాలకు చెందిన భక్తులు 800 అడుగుల ఎత్తులో ఉన్న మాళమల్లేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. అనంతరం కల్యాణోత్సవం తంతు పూర్తయ్యాక ఉత్సవమూర్తులను 350 మెట్లు దిగి కల్యాణకట్ట దగ్గరకు చేర్చారు. ఆ ప్రాంతంలో ఉత్సవమూర్తులను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ క్రమంలో నెరణికి గ్రామ ప్రజలను అరికెర గ్రామ ప్రజలు అడ్డుకుని పల్లకి, ఉత్సవమూర్తులను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామస్థులు ఒక్కసారిగా కోపోద్రిక్తులై కర్రలతో దాడి చేశారు. హోరాహోరీగా సాగిన ఈ బన్ని ఉత్సవంలో ఒకరిపైకరు రాళ్లు విసురుకున్నారు. అగ్ని కాగడాలు విసురుకున్నారు. ఈ ఘటనల్లో అరికెర గ్రామానికి చెందిన కోసిగి తిమ్మప్ప(50) తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య బసమ్మ, ఇద్దరు పిల్లలు సంతానం. ఉత్సవాలను చూసేందుకు వచ్చిన ఆదోని పట్టణంలోని అరుణజ్యోతినగర్‌కు చెందిన ఆంజనేయులు(47) గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు సంతానం. ఈ ఉత్సవంలో 90 మంది గాయాలపాలయ్యారు. కొందరికి తలలు పగిలి రక్తం చిందింది. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి కాలిన గాయాలయ్యాయి. ఇందులో 11 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాళరాత్రి.. కాగడాల వెలుతురులో

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో దసరా పర్వదినాన బన్ని జైత్రయాత్ర ఉత్సవాలు ఏటేటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దుష్టశక్తులపై దైవశక్తులు సాధించిన విజయానికి గుర్తుగా విజయోత్సవ యాత్ర సాగిస్తారు. అందులో భాగంగానే గురువారం రాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో ఉత్సవమూర్తులు మాళ మల్లేశ్వరస్వాముల పల్లకిని వశం చేసుకోవడం కోసం సాగే బన్ని ఉత్సవం కర్రల సమరాన్ని తలపిస్తుంది. స్వామివారి రక్షణార్తులైన నెరణికి, నెరణికితండ, కొత్తపేట గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు కాగడాలు, కర్రలు చేతపట్టుకొని దైవకార్యం విజయవంతంగా నిర్వహించాలని దొళ్లబండ వద్దకు చేరుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో వైషమ్యాలు, విబేధాలు లేకుండా సమష్టిగా దేవుని కార్యం నిర్వహిస్తామని పాలబాసలు చేశారు. డిర్ర్‌ర్ర్‌ర్ర్‌..గోపరాక్‌ (బహుపరాక్‌) అంటూ యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా పట్టుడు కర్రలు, కాగడాలు చేతపట్టుకొని దేవరగట్టు కొండపైకి చేరుకున్నారు. ప్రధాన అర్చకులు గిరి మల్లయ్యస్వామి ఆధ్వర్యంలో మాళ మల్లేశ్వరుల కల్యాణోత్సవం నిర్వహించారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 1:15 గంటలు అయింది. ఉత్సవ మూర్తుల పల్లకితో కొండదిగి సింహాసన కట్టకు చేరుకున్నారు. అప్పటికే స్వామికోసం అక్కడ కర్రలతో సిద్ధంగా ఉన్న ఎల్లార్తి, అరికెర, అరికెరతండా, సులవాయి, ఆలూరు గ్రామాలకు చెందిన భక్తులు నెరణికి, నెరణి కితండా, కొత్తపేట గ్రామస్థులను అడ్డుకున్నారు. క్షణాల్లో వేలాది కర్రలు తలలపై నాట్యమాడాయి. ఓ వర్గం ముందుకు సాగితే, మరోవర్గం వెనుకడుగు వేసింది. కర్రల యుద్ధం తలపించేలా బన్ని ఉత్సవం సాగింది. చివరికి నెరణికి గ్రామస్థులు పైచేయి సాధించి ఉత్సవమూర్తులను వారి గ్రామానికి తీసుకెళ్లారు.

ఉత్సవాలను తిలకించిన ఎస్పీ

బన్ని ఉత్సవాలను ఎస్పీ విక్రాంత్‌రెడ్డి, ఏఎస్పీ హుసేన్‌పీరా, ఆదో ని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్‌, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఉత్సవాలను తిలకించారు. మీడియాతో ఎస్పీ మాట్లాడారు. సంప్రదాయంతో కూడుకున్న ఈ ఉ త్సవాల్లో 90 మంది గాయాలపాలయ్యారన్నారు. ఒకరు మృతిచెందగా, మరో వ్యక్తి గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు. వెయ్యి మంది పోలీసు బలగాలను నియమించామన్నారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐలు, అధికారులు పాల్గొన్నారు.

దేవరగట్టుకు ఇటలీ దేశస్థులు

ఉత్సవాలను వీక్షించిన విదేశీయులు

ఆలూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దేవరగట్టు బన్ని ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఏడాది ఉత్సవాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు విదేశీయులు తరలి వచ్చారు. ఇటలీకి చెందిన ఓ బృందం దేవరగట్టుకు తరలివచ్చింది. ఇక్కడి కర్రల సమరాన్ని వారు ఆసక్తిగా తిలకించారు. ప్రతి సన్నివేశాలను కెమెరాలో బంధించారు. భక్తులతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఇక్కడ కొనసాగుతున్న ఆచారం.. సంప్రదాయాలను తమ దేశంలో డాక్యుమెం టరీగా రూపొందిస్తామని ఇటాలియన్లు తెలిపారు. భారతదేశంలో అనాదిగా వస్తున్న ఇలాంటి ఆచారాలు దేశ ఐక్యతను చాటుతాయని వారు అన్నారు. అయితే భక్తి పేరుతో ఇలా తలలు పగులకొట్టుకోవడం ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుందని వారి భాషలో తెలిపారు. స్థానిక ప్రజలు సాదరంగా ఆహ్వానించి తమను అక్కున చేర్చుకోవడంపై ఇటలీ దేశస్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు సైతం విదేశీయులకు రక్షణ కల్పించారు.

దేవరగట్టులో భవిష్యవాణి

దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి బన్ని జైత్రయాత్రలో కీలక ఘట్టం భవిష్యవాణి (కార్ణికం). బన్నీ జైత్రయాత్ర ఊరేగింపు అనంతరం ఆదివారం ఉదయం 6:15 నిమిషాలకు ఎదురు బసవన్న గుడి వద్ద పూజారి గిరి మల్లయ్య స్వామి భవిష్య వాణి వినిపించారు. దేవర గట్టులో చెప్పే భవిష్యవాణిపై రైతులకు ఎంతో నమ్మకం. పూజారి గోపర్రాక్‌.. అనడంతో ఒక్కసారిగా భక్తులు నిశ్శబ్ధాన్ని పాటించారు. కన్నడ భాషలో మాట్లాడుతూ...

ఆరు అరడాదితూ హెచ్చరా (దేశరాజకీయాల్లో సంక్షోభం, యుద్ధ వాతావరణం నెలకొనవచ్చు. జాగ్రత్త వహించాలి)

శక్తి ధ్యాన మాడబెకు (శక్తి స్వరూపిణి అమ్మవారిని ధ్యానించాలి)

గంగి హోలేదండిగే నింతాలే, నీతూ ఉత్తర దిక్కలి సంహార మడిద్దాలే

(గంగమ్మ నది ఒడ్డున నిలిచి, దేశ ఉత్తర దిక్కున సంహారం చేస్తుంది. ఉత్తర దిక్కున వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి)

క్వింటాళ్ల 6,200/- నగె హళ్లె (పత్తి)

క్వింటాళ్ల 3,400/- జ్వాళే (తెల్ల జొన్న)

3-6.. 6-3.. మూడు ఆరు అవుతుంది. ఆరు మూడవుతుంది. వాణిజ్య పంటల ధరలు పెరిగి, తగ్గు ముఖం పట్టవచ్చు. రైతులు సుఖ సంతోషాలతో ఉంటారు. బహుపరాక్‌ అంటూ భవిష్య వాణి (కార్ణికం) ముగించారు.

రక్తపడి వద్ద పడికెడు రక్తం

తెల్లవారుజామున దేవరగట్టులోని రక్తపడి వద్దకు గొరవయ్య చేరుకున్నారు. ఈ సందర్భంగా పొడవైన దబ్బనం గుచ్చి పొడవైన దారాన్ని లాగారు. ఈ క్రమంలో వచ్చిన పడికెడు రక్తాన్ని రక్తపడికి సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను శుక్రవారం ఉదయం 7 గంటలకు తిరిగి జైత్రయాత్రగా వచ్చి సింహాసనం కట్ట వద్దకు చేరుకోవడంతో బన్ని ఉత్సవం ముగిసింది.

వైభవం.. మాళమల్లేశ్వరుడి కల్యాణం

కర్రలతో కదనం రంగంలోకి..

దేవరగట్టుకు పోటెత్తిన భక్తులు

ఆలూరు/ హొళగుంద, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : దేవరగట్టు మాళమల్లేశ్వరుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. గురువారం అర్థరాత్రి 12.30 గంటల డిర్ర్‌ర్ర్‌ర్ర్‌ గోపరాక్‌ (బహుపరాక్‌) అంటూ వేలాదిగా భక్తజనం దేవరగట్టుపైకి చేరుకుంది. నేరణికి, నేరణికి తాండా, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు తలకు పాగాచుట్టి చేతిలో కర్రపట్టి యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా దేవుడి కార్యంలో నిమగ్నమయ్యారు. శుభముహూర్తం అర్థరాత్రి 12.45 నుంచి 1.15 నిమిషాలకు వేదపండితులు రవిశర్మ మాళ మల్లేశ్వరస్వాముల కల్యాణోత్సవం నిర్వహించారు. జైత్రయాత్రకు సై అంటూ ఉత్సవ మూర్తులతో కొండ దిగి సింహాసన కట్ట వద్దకు చేరుకోగా దేవుడ్ని దక్కించుకోవడానికి అప్పటికే అక్కడికి చేరుకున్న పలు గ్రామాల భక్తులు కర్రలతో మేము సైతం అంటూ కదనరంగంలోకి దిగడంతో బన్ని ఉత్సవం మొదలైంది. 800అడుగుల పైభాగాల ఉన్న దేవరగట్టుపై దాదాపు అరగంట పాటు బన్ని ఉత్సవం జరిగింది. ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం దేవరగట్టు వేదికగా గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జరిగిన ఉత్సవాన్ని కళ్లారా వీక్షించాలని రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

Updated Date - Oct 03 , 2025 | 11:58 PM