రుధిర ధారులు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:59 PM
పుట్టబోయే బిడ్డ కోసం ఆసుపత్రికి బయల్దేరిన దంపతులు.. అనారోగ్యం బారిన పడి నాటు వైద్యుడిని సంప్రదించేందుకు భార్య, కుమారుడితో బయల్దేరిన హోంగార్డు. ఉదయం సంతోషంగా బయల్దేరిన ఆ ఐదుగురిని కాలం బలితీసుకుంది.

ఆదోని మండలం పాండవగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం
రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కర్ణాటక బస్సు
ఐదుగురు దుర్మరణం
కుప్పగల్లుకు చెందిన దంపతులు మృతి
మరో దంపతులు, కుమారుడు మృత్యువాత
అతివేగమే ప్రమాదానికి కారణం
విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్
పుట్టబోయే బిడ్డ కోసం ఆసుపత్రికి బయల్దేరిన దంపతులు.. అనారోగ్యం బారిన పడి నాటు వైద్యుడిని సంప్రదించేందుకు భార్య, కుమారుడితో బయల్దేరిన హోంగార్డు. ఉదయం సంతోషంగా బయల్దేరిన ఆ ఐదుగురిని కాలం బలితీసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురై మృత్యుఒడికి చేరారు. అతివేగంతో ఐదు నిండు ప్రాణాలను బలితీసుకున్న కర్ణాటక బస్సు రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. వీరిలో ఓ మహిళ గర్భిణి కావడం మరింత విషాదకరం. ‘అయ్యో.. దేవుడా.. ఎలా బతికేది స్వామీ. ఎంత పనిచేశావయ్యా. బిడ్డలను దిక్కులేని వాళ్లను చేశావు కదయ్యా..’ అంటూ కుటుంబ సభ్యులు విలపించడం చూపరులకు కన్నీళ్లను తెప్పించింది. ఈ విషాద సంఘటన ఆదోని మండలం పాండవగల్లు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
ఆదోని/ఆదోని రూరల్, కర్నూలు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల గర్భిణిగా ఉన్న భార్యకు వైద్యపరీక్షల కోసం ఓ జంట.. చర్మసంబంధిత నాటు వైద్యం కోసం కొడుకుతో కలసి మరో జంట ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరిది ఒకే అవసరం. వైద్యం చేయించుకోవాలని ప్రయాణమయ్యారు. మరో 15-20 నిమిషాల్లో గమ్యానికి చేరుకోబోతున్నారు. ఎండలు మండుతుండడంతో త్వరగా వెళ్లి వైద్యం చేయించుకొని ఇంటికి చేరుకోవాలని సాగిపోతున్నారు. రెండు బైక్‌లు పాండవగల్లు గ్రామం దాటి జాలిమంచి క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఎదురుగా మృత్యుశకటంలా వస్తున్న కర్ణాటక బస్సు వీరి ద్విచక్ర వాహనాలను ఒకదాని తరువాత మరోదాన్ని వేగంగా ఢీ కొట్టింది. బైకులపై వెళ్తున్న ఐదుగురు బస్సు చక్రాలు కింద నలిగిపోయారు. కుప్పగల్లుకు చెందిన యువ రైతు కురవ పూజారి ఈరన్న, అమ్మ గర్భంలో పెరుగుతున్న పిండంతో సహా ఆయన భార్య ఆదిలక్ష్మి, కర్ణాటక రాష్ట్రం మాన్వి పట్టణానికి చెందిన హోంగార్డు మంగలి హేమాద్రి భార్య నాగరత్న, కుమారుడు దేవరాజు అక్కడికక్కడే మృత్యుఒడికి చేరుకున్నారు. రక్తమడుగులో చిక్కుకొని కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హోంగార్డు హేమాద్రినైనా బతికించాలని పోలీసులు ఆదోని ఆస్పత్రికి చేర్చగా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఆదోని-మంత్రాలయం రహదారి.. రుధిర ధారలతో రక్తసిక్తమైంది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసిన స్థానికులు ‘అయ్యో..! పాపం ఎంత ఘోరం జరిగింది’ అంటూ కన్నీరు పెట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
ఆదోని మండలం పాండవ గల్లు గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదోని మండలం కుప్పగల్లు గ్రామానికి చెందిన యువరైతు దంపతులు కురవ పూజారి ఈరన్న (25), మూడు నెలల గర్భవతి పూజారి ఆదిలక్ష్మి (వీరిద్దరు టీడీపీ కార్యకర్తలు), కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి పట్టణంలో అగ్నిమాపక విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న మంగలి హేమాద్రి (40), ఆయన భార్య నాగరత్న (35), కుమారుడు మంగలి దేవరాజు (20) ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కుప్పగల్లుకు చెందిన పూజారి ఈరన్న భార్య పూజారి ఆదిలక్ష్మి మూడు నెలల గర్భవతి. ఆమెకు స్వల్పంగా రక్తస్రావం అవుతుండడంతో ఆదోనిలో చికిత్స, నెలవారి వైద్య పరీక్షల కోసం మూడేళ్ల కూతురు సుస్మితను అవ్వతాతలు వీరేషమ్మ, రామన్నల వద్ద వదిలిపెట్టి.. ఉదయం 9:30 గంటల సమయంలో ఏపీ21 బీజే 4324 ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అలాగే చర్మ సంబంధిత జబ్బుకు ఆదోని మండలం ఇస్విలో నాటు వైద్యం కోసం తెల్లవారుజామునే కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి పట్టణానికి చెందిన అగ్రిమాపక శాఖ హోంగార్డు మంగలి హేమాద్రి (40) భార్య నాగరత్న (35), కుమారుడు మంగలి దేవరాజు (20)తో కేఏ 36 హెచ్‌డీ 8129 మోటర్ బైక్‌పై బయలుదేరారు. ఈ రెండు జంటలు వెళ్తున్న బైకులు సుమారుగా 10 గంటల సమయంలో పాండగల్లు గ్రామం దాటి జాలిమంచి క్రాస్ రోడ్డు చేరుకున్నాయి. మరో 15-20 నిమిషాల్లో గమ్యానికి చేరుకోబోతుండగా.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు కేఏ 37 ఎఫ్ 0711 వీరి ద్విచక్ర వాహనాలను ఒకదాని తరువాత ఒకదాన్ని వేగంగా ఢీకొంది. బైకులను ఢీకొట్టిన బస్సు.. అదే వేగంలో పొలంలోకి దూసుకెళ్లి ఓ వేపచెట్టును ఢీకొట్టగా ఆ చెట్టు వేళ్లతో సహా ధ్వంసమైంది. కుప్పగల్లుకు చెందిన భార్యభర్తలు ఈరన్న, ఆదిలక్ష్మి మృతదేహాలు బస్సు చక్రాల కిందే నలిగిపోగా.. మాన్వికి చెందిన తల్లికొడుకులు నాగరత్న, దేవరాజుల మృతదేహాలు రోడ్డు పక్క చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రమైన గాయాలతో రక్తపుమడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హోంగార్డు మంగలి హేమాద్రిని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ప్రయో జనం లేకపోయింది. చికిత్స పొందుతూ నిమిషాల్లోనే ఊపిరి వదిలారు. మృతుల బంధువులతో ఆస్పత్రి శోకసంద్రంగా మారింది.
ఊరుగాని ఊళ్లో మృత్యువాత
కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి పట్టణంలో మంగలి హేమాద్రి అగ్నిమాపక శాఖలో హోంగార్డుగా పని చేస్తున్నారు. భార్య నాగరత్న, కొడుకు దేవరాజు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూరుతుకు పెళ్లి చేయగా.. మిగిలిన ముగ్గురు కూతుళ్లు 7,8,10వ తరగతి చదువుతున్నారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న దేవరాజు స్థానిక సెలూన్ షాపులో కులవృత్తి పని చేస్తూ నాన్నకు తోడుగా ఉన్నాడు. హేమాద్రికి చర్మసంబంధిత సమస్యలు తలెత్తాయి. అక్కడి డాక్టర్లకు చూపించిన తగ్గకపోగా.. రోజురోజుకు పెరుగుతూ రావడంతో.. ఆదోని మం డలం ఇస్వీ గ్రామంలో నాటు వైద్యం చేస్తారు. తగ్గిపోతుందని తెలిసిన వాళ్లు చెప్పడంతో.. మంగళవారం సెలూన్ షాప్‌కు సెలవు ఉందని దేవరాజు బైక్‌పై నాన్న హేమాద్రి, అమ్మ నాగరత్నలను ఎక్కించుకొని దాదాపు 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇస్వీకి బయలుదేరారు. ఊరుగాని ఊళ్లో రోడ్డు ప్రమాదానికి తల్లిదం డ్రులు, కొడుకు ముగ్గురు విగతజీవులగా మారారు. కన్నవాళ్లను కోల్పోయి..మాకెవ్వరు దిక్కు అంటూ కుమార్తెలు బోరున విలపించారు.
మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ విచారం
పాండవగల్లు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌లు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. కర్ణాటక బస్సు ఢీకొని కుప్పగల్లుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి దంపతులు, కర్ణాటక వాసులు ముగ్గురు మృతి చెందడం అత్యంత బాధాకర మని లోకేశ్ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆధికా రులు, ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినా యుడులను వాకాబు చేశారు. టీడీపీ కార్యకర్తల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ప్రమాద ఘటనపై ఎస్పీ, కలెక్టర్లతో మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు ఆస్పత్రికి చేరుకొని రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
పాండగల్లు రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్పీ విక్రాంత్‌పాటిల్ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కర్ణాటక ఆర్టీసీ బస్సును, ఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయిన ద్విచక్రవాహనాలను తనిఖీ చేశారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ వెంట ఆదోని డీఎస్పీ హేమలత, ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, పెద్దతుంబళం మహేశ్‌కుమార్ ఉన్నారు.
14 మంది ప్రాణాలు పాడిన వేప చెట్టు
బస్సులోని 14మంది ప్రయాణికు లను ఓ వేపచెట్టు కాపాడింది. ఆదోని నుంచి మంత్రాలయానికి వేగంగా వెళ్తున్న కర్ణాటక బస్సు ప్రమాదం జరిగిన స్థలానికి ముందు ఉనన కల్వర్టును దాటే క్రమంలో వేగాన్ని నియంత్రించుకోలేక డ్రైవర్ ఎడమ నుంచి కుడికి బస్సును తిప్పడం.. అదే సమయంలో రోడ్డుకు వెళ్తున్న మోటర్ బైక్‌లను ఢీకొట్టి.. పొలాల్లోకి దూసుకుపోయి వేప చెట్టును ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. చెట్టు వేళ్లతో సహా కింద పడిపోయిందంటే ఎంత వేగంతో ఢీకొట్టి ఉంటుందో అంచనా వేయవచ్చు. చెట్టే లేకపోయి ఉంటే బస్సు పల్టీలుకొట్టి 14 మంది చనిపోయేవారు.
దటీజ్ పోలీస్..
పాండవగల్లు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగిందనే సమాచారం రాగానే ఆదోని డీఎస్పీ హేమలత, ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, ఒన్‌టౌన్ సీఐ శ్రీరాం, పెద్దతుంబళం ఎస్‌ఐ మహేశ్‌కుమార్ సహా సిబ్బంది హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్నారు. పొలంలో వేప చెట్టును ఢీకొని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. వాళ్లు బతికే ఉన్నారా..! అంటూ ఒక్కొక్కరిని పరిశీలించారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కర్ణాటక వాసి హోంగార్డు హేమాద్రిని పోలీస్ జీపులో ఎక్కించి ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి రలించారు. కుప్పగల్లుకు చెందిన భార్యభర్తలు పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి, కర్ణాటక రాష్ట్రం మన్వికి చెందిన నాగరత్న, దేవరాజు ఘటన స్థలంలోనే మృతి చెందారని పోలీసులు నిర్ధారించుకొని.. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలిం చేందుకు ఆటోలు సిద్ధం చేశారు. అప్పటికే వందలాది మంది చేరుకొని అయ్యే పాపం.. ఎంత ఘోరం జరిగిందని జాలి చూపుతున్నారే తప్పా.. మృతదేహాలను ఆటోలో ఎక్కించేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సీఐలు నల్లప్ప, శ్రీరాం, ఎస్‌ఐలు మహేశ్‌కుమార్, నాగేంద్ర, రామాంజనేయులు ఒక్కొక మృతదేహాన్ని ఆటోలోకి చేర్చారు. దటీజ్ పోలీస్ అనిపిం చారు. స్థానికులు ఒకరిద్దరు పోలీసులకు సహకరించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ గంగవతికి చెందిన మహ్మద్ సాబ్‌లాతి ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయారని పోలీసులు తెలిపారు.
అయ్యో సుస్మిత..!
ఆదోని మండలం కుప్పగల్లు గ్రామానికి చెందిన రైతు దంపతులు కురువ పూజారి రామన్న, వీరేశమ్మ దంపతు లకు ఏకైక కుమారుడు పూజారి ఈరన్న. తమకున్న పొలంలో సేద్యం చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. అదే మండలం కె.నాగులాపురం గ్రామానికి చెందిన చిన్న ఉచ్చీరప్ప, ఉరుకుందమ్మ దంపతుల కుమార్తె ఆది లక్ష్మితో నాలుగేళ్ల క్రితం ఈరన్న వివాహం జరిపించారు. వీరికి మూడేళ్ల సుస్మిత సంతానం. ఆదిలక్ష్మి మళ్లీ గర్భం దాల్చింది. మూడు నెలల గర్భవతి ఆదిలక్ష్మికి స్వల్పంగా రక్తస్రావం కావడం, నెలవారి వైద్య పరీక్షల కోసం ఆదోని వెళ్తుతూ ఈ ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ‘మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తారు..’ అని ఆ చిన్నారి అడుగుతుంటే.. సమాధానం చెప్ప లేని స్థితిలో బంధువులు విలపించారు. అమ్మానాన్నలు లేరని, తోబుట్టువు ఇక రాదని తెలియక అమాయకంగా.. దీనంగా చూస్తున్న ఆ చిన్నారి తల్లిదండ్రుల కోసం ఎదురుచూసింది.